Home Uncategorized Kubera Swamy Jayanti

Kubera Swamy Jayanti

0
Kubera Swamy Jayanti
Kubera Swamy Jayanti

Kubera Swamy Jayanti – కుబేర స్వామి జయంతి

శ్రావణ శుద్ధ ఏకాదశి కుబేర స్వామి జయంతి

సకల సంపదలకు ఉత్తర దిక్కునకు అధిపతి , లోకపాలకుడైన యక్షరాజే కుబేరుడు. శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ఓం యక్షరాజయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ !
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ  ధనధాన్య సమృద్ధిందేహీ రుద్రాయ స్వాహ !! అంటూ కుబేరుణ్ణి ఆరాధించిన వారికి
ధనప్రాప్తిని కలిగించి , ఆర్థిక భాధలను తొలగిస్తాడని  శాస్త్ర వచనం.

కుబేరుడు అష్టదిక్పాలకుల్లో ఒకడు. 

ఆయన ఉత్తర దిశకు అధిపతి.  యక్షులకు నాయకుడు.  అతడి తపోనిష్ఠకు మెచ్చి శ్రీమహాలక్ష్మి  అపార ధనరాశినిచ్చి , సిరిసంపదలకు శాసకుడిగా చేసింది.
కుబేరుడు రావణాసురుడికి సోదర సమానుడు. వీరిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే.  బ్రహ్మ వంశంలో పులస్త్యుడికి విశ్రవసుడు జన్మించాడు. విశ్రవసుడు ఇలబిల , కైకసి మొదలైన కన్యలెందరినో వివాహమాడాడు. ఇలబిలకు పుట్టినవాడే కుబేరుడు.
కుబేరుడు పూర్వజన్మలో యజ్ఞదత్తుడి కుమారుడు. పేరు గుణనిధి. పేరుకు గుణనిధే కానీ దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. పాపాత్ముడై యాదృచ్ఛికంగా ,
శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల తరవాతి జన్మలో కుబేరుడిగా జన్మించి , ఉత్తర దిశలోని నిధినిక్షేపాలన్నింటిపైనా
ఆధిపత్యం పొందాడు.
లంకా నగరాన్ని , పుష్పక విమానాన్ని బహుమానంగా పొందిన కుబేరుణ్ణి రావణుడు వచ్చి లంక నుంచి వెళ్ళగొట్టి వాటిని సొంతం చేసుకున్నాడు.
అప్పుడు కుబేరుడు శివుణ్ని ఆశ్రయించాడు. శివానుగ్రహం పొంది , అలకాపురికి ఏలిక అయినాడు.
Kubera Swamy Jayanti
Kubera Swamy Jayanti
కుబేరుడి భార్యకు చిత్రరేఖ అని , భద్ర అనే రెండు పేర్లున్నాయి. వీరి పుత్రులు మణిగ్రీవుడు , నలకూ బరుడు , పాంచాలికుడు. కుమార్తె పేరు మీనాక్షి.
తన అసమాన భక్తి ప్రపత్తులతో  శివుడి సాన్నిహిత్యాన్ని పొందిన  కుబేరుడు ఓసారి శివుడి పక్కనే కూర్చున్న పార్వతిని కుటిల దృష్టితో చూశాడు.  అతడి కామవాంఛను గ్రహించిన జగన్మాత  అతడి కుడికన్ను పోవాలని శపించింది.
తప్పు తెలుసుకున్న కుబేరుడు అమ్మను క్షమాపణ కోరగా , తల్లి కరుణించినా , చూపు వచ్చినా , చేసిన పాపానికి గుర్తుగా కుబేరుడి కన్ను లొట్టపోయింది.
ధనబలంతో గర్విష్ఠి అయిన కుబేరుడు ఓసారి తన ఐశ్వర్యాన్ని చాటుకోవాలని సకల దేవతల్ని విందుకు పిలిచి ,  శివుణ్ని కూడా ఆహ్వానించాడు. శివుడు తనకు బదులుగా పుత్రుడు గణపతిని పంపాడు. గణపతి ఎదుట పదార్థాలన్నీ చేరాయి.
క్షణంలో గణపతి అన్నీ ఖాళీ చేసేశాడు. కుబేరుడెన్ని పిండివంటలు తెప్పించినా  క్షణాల్లో తినేస్తున్నాడు క్షిప్రగణపతి. ఇది గ్రహించిన కుబేరుడి అహం అంతరించింది.
శివుణ్ని క్షమాపణ వేడుకున్నాడు. స్వామి సూచన మేరకు ప్రేమతో గణపతికి పిడికెడు ఆహారం తినిపించాడు. లంబోదరుడు అప్పుడు తృప్తిగా తేన్చాడు.
కుబేరుడి గురించి అధర్వణ వేదంలోను , శివ , బ్రహ్మాండ , బ్రహ్మ పురాణాల్లో , రామాయణ , భారత , భాగవతాల్లో విస్తృతమైన కథలున్నాయి.
ధనత్రయోదశి నాడు , లక్ష్మీదేవితోపాటు కుబేరుణ్నీ పూజిస్తారు. కుబేరుడి వాహనం నరుడని చెబుతుంటారు.  కొన్ని గ్రంథాల్లో గొర్రెపొట్టేలు అనీ ఉటంకించారు.
జైన మతస్థులు కుబేరుణ్ని  వైశ్రవణుడి పేరుతో ఆరాధిస్తారు. కుబేరుడి ప్రతిమ , కుబేర దీపం , కుబేర యంత్రాలను
అర్చించడం చాలా మంచిది. కుబేర దీపాన్ని కొని ఇతరులకు తప్పక దానం చేయాలి.
కుబేర యంత్రాన్ని మాత్రం పూజా మందిరంలో ఉంచి పూజిస్తారు. పద్మ , మహాపద్మ , శంఖ , మకర , కచ్ఛప, ముకుంద ,  కుంద , నీల , వర్చన అనే నవ నిధులు  కుబేరుడి అధీనంలో ఉంటాయి.
కుబేరుణ్ని అనుదినం భక్తితో అర్చించి నామజపం చేస్తే , నవనిధులను అతడు ప్రసాదించి , అనుగ్రహిస్తాడని  శాస్త్రాలు చెబుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: