
Sri Brahma puranam – 7 – శ్రీ బ్రహ్మపురాణం – 7
సూర్యవంశ నిరూపణమ్
లోమహర్షణుడు పలికెను – వైవస్వతమనువునకు తొమ్మండ్రు కుమారులు గల్గిరి. వారు తండ్రియంతవారు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు యనువారు.
వారుకల్గకముందు మనువు మిత్రావరుణులనుద్దేశించి పుత్రకామేష్టినొనసరించెను. అందతుడు మిత్రావరుణులనెంచి యాహతులిచ్చెను. అక్కడ దివ్యాంబరా భరణములుదాల్చి దివ్యశరీరముతో ఇల యను నంగన యావిర్భవించెనని వినికిడి.
మనువు దండధరుడై యామెను ఇలా ఇలాయని పేర్కొని ఓ కల్యాణి నావెంటరమ్మని పిలిచెను. పుత్రకామియైన యాప్రజాపతింగని ధర్మయుక్తముగ నిట్లుపల్కెను.
ఓ మిత్రావరుణ దేవతలార ! మీ యంశముచే జనించినదాన. మీకేమి సేయుదును. మనువు తన నమవర్తింపుమన్నాడని యిల పలికినంతవారు ధర్మపరాయణయగు నాసాధ్వింగూర్చి యిట్లపలికిరి.
మానిని ! నీ ధర్మము వినయము ఇంద్రియనిగ్రహము సత్యమనువానికిం బ్రీతులైతిమి. ఓ సుందరి ! మహానుభావయగు నీవు మా కన్యవుగా ఖ్యాతినందుదువు.
మనువునకు వంశకరుండగు కుమారుడవు గూడ నీవ యయ్యెదవు. జగత్ర్పియుడవు ధర్మశీలుడవు. మనువంశ వర్ధనుడ వయ్యెదవు. నుద్యుమ్నుడను పేర ముల్లోకములందు ప్రసిద్ధుడవయ్యెదవు.
అంతనామె వారిమాటలు విని వెనుదిరిగిపోవుచు దారిలో బుధునిచే గామింపబడి సంగమమువడసి సోమపుత్రుడగు నాతని వలన పురూరవుడను కొడుకుంగనియెను.
అవ్వల నామె సుద్యుమ్నుడను పేర మగవాడయ్యెను. సుద్యుమ్నుని దాయాదులు పరమ ధార్మికులు ముగ్గురు.
ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు ననువారు ఉత్కలుని భార్య ఉత్కల, వినతాశ్వుని వల్లభ పశ్చిమదిక్కు, గయుని భార్య ప్రాగ్దిక్కు గయ యను పేర్లందినది మనువు సూర్యునందు జొచ్చినంతట నీతని దాయాదులు క్షత్రజాతివారీ పృథివిని బదిభాగము లొనరించిరి.
జ్యేష్ఠుడు ‘ఇక్ష్వాకువు’ మధ్యదేశమును బడసెను. సుద్యుమ్నుడు మున్ను కన్యయై యున్నందున రాజ్యభాగములేని వాడయ్యెను. వశిష్టవచనముచే ప్రతిష్ఠానమందు ధార్మికుడైన సుద్యుమ్నునకి ప్రతిష్ఠ (ఉనికి) లభించెను. దానినితడు పురూరపున కొసంగెను.
సుద్యుమ్నుడు మనువుకుమారుడయ్య స్త్రీ పుంసలక్షణములు గలవాడై (ఇల-సుద్యుముడునని పిలువcబడుచు) పృథివిం ధరించెను.
నాభాగుని కొడుకులు నరిష్యంతులు శకులు ననువారు. అతనికి అంబరీషుడును పుత్రుడై జనించెను. ధృష్టునికి రణదృప్తమయిన క్షత్రజాతి ధార్షికమనుపేర నుదయించినది. కరూశునికి కారూశులు కల్గిరి.
వారును యుద్ధమునం దుద్ధతులు. నాభాగధృష్టసంతానమైన క్షత్రియులు వైశ్యత్వమునందిరి. ప్రాంశువునకు ప్రజాపతియును కుమారుడుగల్గెను. నరిష్యంతునిదాయాది దతంధరుడు.
శర్యాతికి ఆనర్తుడను కుమారుడు సుకన్యయను కన్యయు మిథునముదయుంచెను. సుకన్య చ్యవనమహర్షి కిల్లాలయ్యెను అనర్తుని దేశ మానర్తము. అతనిరాజధాని కుశస్థలి.
ఆనర్తునిదాయాది రైవుడని నాతడు మహాతేజస్వి. రైవుని పెద్దకొడుకు (రైవతుడు కకుద్మియను పేరుగలవాడు ధార్మికుడు. కుశస్థలి రాజధానిగా రాజ్యమేలినవాడు.
తన కన్యకతోనేగి బ్రహ్మసన్నిధి నొక్క ముహూర్తకాలముండి గాంధర్వమును (సంగీతమును) విన్నవాడు. అమ్ముహూర్తకాలము పుడమిపై పెక్కు యుగమ్ములయ్యెను.
అతడు తన రాజధానికి దిరిగివచ్చెను. అప్పుడా నగరమును యాదవు లావరించియుండిరి. పెక్కుద్వారములు గలదియై యప్పుడది ద్వారకయను పేర మనోహరమయ్యెను. అది భోజనవృష్ణ్యంధకకులమువారగు వసుదేవాదుల పాలనమందుండెను.
రైవతుడది తెలిసికొని బలదేవునకు దన కన్యను (రేవతిని) సుభద్రయను పేరు గలదానిని నొసంగెను. ఆ మీద మేరుశిఖరమునకేగి తపస్సు నందుండెను. ధర్మాత్ముడగు బలరాముడును రేవతీదేవితో సుఖముగ విలసించెను.
మునులడిగిరి – పెక్కుయుగములు గడచెగదా ? రేవతికి కకుద్మికి (రేవతుని కుమారునికి) ముదిమిరాలేదేమి? మేరుపునకేగిన శర్యాలికిని గల్గిన సంతతి యిప్పటికిని పృథివియంచెట్లున్నది. ఈ విషయము స్పష్టముగ వినగోరుచున్నాము

మహర్షుడిట్లనియె
అనఘులార ! బ్రహ్మలోకమున ముదిమి యుండదు. అకలిదప్పికలుండవు మృత్యువుండదు. ఋతు చక్రము తిఱుగదు స్వర్లోకమేగిన రేవత కుమారుడగు కక్కుద్మియొక్క రాజధాని కుశస్థలి రాక్షసులచే హరింపబడెను.
అతనికి సోదరులు నూరుగురుండిరి. కాని వారు రక్షగణముబారిబడి చావుదప్పి నలుదెసలకు బారిపోయిరి. వారి వంశమందందు చెల్లాచెదరైనది. వారి పరంపర వారు శర్వాతులను పేరందిరి.
గుణవంతులయిన యాక్షత్రియులు సర్వదిక్కులంటిపోయి గహనములంజొచ్చిరి. నాభాగునియొక్కయు నరిష్టునియొక్కయు కొడుకు లిర్వురు వైశ్యులు బ్రాహ్మణత్వముం బడసిరి.
కరూశుని సంతతి కారూశులు. వృషదుడను వాడు గురుధేనువును హింసించి, గురుశాపముచే శూద్రత్వమందెను. ఇది యా తొమ్మండ్ర చరిత్ర.
వైవస్వతమనువు మునియే. అతడు తుమ్మగా నందుండి ఇక్ష్వాకువు పుట్టెను, అతనికి నూర్గురు పుత్రులు పుట్టిరి. వారు భూరిదక్షిణలిచ్చి యజ్ఞములు గావించినవారు, వారు వికుక్షి పెద్దవాడు .
కుక్షిలేని వాడగుటచే అయోధ్యత్వమును పొందెను ( ఎదిరి యుద్ధముచేయ నశక్యము గాని వాడయ్యెను.) అందుచేతనే యతని రాజధాని అయోధ్య యనబడెను.
అయన పుత్రులు శకుని మొదలయిన వారయిదువందలమంది ఉత్తరాపథము నేలు వారైరి. మహా బలశాలురు. యేబడి ఎనిమిదిమంది దక్షిణదిశను బాలించిరి. ఇక్ష్వాకువు వికుక్షిని అష్టకా శ్రాద్ధమందు మాంసము తెమ్మని పంపెను.
శ్రాద్ధనిమిత్ము గనుక శశమును (కుందేటిజాతి) జంపి యతడామాంసమును తానే దిని శశాదుడను పేరంది, వశిష్ఠు మాటంబట్టి ఇక్ష్వాకుచే పరిత్యక్తుడై వేటకు బోయెను.
ఇక్ష్వాకువుండగనే శశాదుడు రాజయ్యెను. శశాదుని దాయాదుడు కకుత్థ్సుడు. మంచి బలశాలి. ఆయన కొడుకు అనేనుడు. (ఏనస్సు పాపము ఆదిలేనివాడు అనేనస్సు) అతిని కొడుకు ప్భథుడు.
వానికి విష్టరాశ్వుడు. వానికార్ట్రుడు. వానికి యువనాశ్వుడు, వానికి శ్రావుడు, గల్గిరి. శ్రావస్తకుడు శ్రావుని కుమారుడు శ్రావస్తి నగర నిర్మాత.
వాని కొడుకు బృహదశ్వుడు వాని సుతుడు కువలాశ్వుడు. పరమధర్మమూర్తి. ధుంధువను వానివ సంహరించి ధుంధుమారు డననయ్యె.
మునులడిగిరి | ఓ నూత ! ఎవని కువలాశ్వుడు ధుంధుమారుడయ్యెనో అధుంధువధను గూర్చి వినగోరుచున్నాము.
నూతిడిట్లు చెప్పదొడంగె- కువలాశ్వునికి నూర్గురు కొడుకులు ఉత్తమధానుష్కులు అందరు విద్వాంసులు. అజయ్యులు ధార్మికులు. ఎల్లరు భూరిదక్షిణులయిన యజ్వలు.
బృహదశ్వుడు కువలాశ్వుని రాజ్యమందుంచి వనమునకు ప్రస్థానము సేయబోగా యతని నుత్తంక మహర్షి పోవలదని వారించెను.
ఉత్తంకు డిట్లనియో – నీవు రక్షణ సేయవలసినవాడవు అందలకర్హుడవు. నేను ఆందోళనము లేకుండ తపస్సు జేయుటకుచాలను నా ఆశ్రమ సమీపమున చదునైన మరుధన్వములనెడి ప్రదేశములందు సముద్రుడు వాలుకాపూర్ణుడై (ఇసుక మేటలు వేసినది) ఉద్దాకుడని పిలవబడును.
ఆ సుముద్రమందు దేవతలకేని యవధ్యుడు మహాకాయుడు బలశాలి ఇసుకలోన శయనించియుండు మధు పుత్రుడగు ధుందుడను మహాసురుడు. లోకనాశనమునకు దారుణతపమొనరించుచుండును.
సంవత్సరము చివర వాడొకసారి నిట్టూర్పుపుచ్చును. అప్పుడు భూకంపము వచ్చును. వాని నిఃశ్వాసవాయువుచే నిసుకలేచి ఏడురోజులు ఆదిత్యమండలము దాక కప్పివైచును.
మిణుగురులతో, నిప్పులతో, పొగతో నది యతి దారుణము నగనుండును. నేనచట తపమొనరింప నిలువలేకుంటిని. లోక క్షేమమున కీవువాని సంహరింపుము. తన్మారణమొనరింప లోకములు స్వస్థములగును.
నొవొక్కడవ వాని సంహరింప సమర్ధుడవు. వానం జంపిన వానికి వరములిచ్చి వాని ప్రతాపఖ్యాతి గావింపుమని విష్ణువు నాకు వరమిచ్చెను. వాడు మహాతేజస్వి.
అల్పతేజస్వి చేత మడియడు అన నా ఉత్తంకుని పలుకువు విని తన సుతుని కువలాశ్వుని జూపి స్వామి ! నేనస్త్రత్యాగము చేసితిని. ఈతడు ధుంధు వధ యొనరింపజాలునని చెప్పి తీవ్రతపోనిష్ఠకై పర్వతమున కేగెను.
లోమహర్షణు డిట్లనియొ – ఓ బ్రాహ్మణులారా ! కువలాశ్వుడు నూర్గురు కొడుకులతో ధుంధుని పైకి దండెత్తెను. ఉత్తంకుడాతని వెంటనుండెను. అప్పుడు విష్ణుభగవాను డాతని నావేశించెను.
అతడెత్తి చసువేళ ”నీతడు శ్రీమంతుడు. అవధ్యుడు. తప్పక ధుంధువును జంపగలడ” ను శబ్దము నింగిని వినబడెను. అతనినిదేవతలు దివ్యగంధమాల్యములచే ముంచెత్తిరి.
దేవ దుందుభులు మ్రోగెను. అతడు సుతులతోనేగి సముద్రమును మూలమట్టుగా త్రవ్వించెను. పడమటి దిశ నారక్కసుడు బయలువడి వారినెదిరించెను. వాని ముఖాగ్ని పెనుగాలితో రేగి లోకముల దహించినట్లయ్యెను.
వెల్లువలై నీరుబికెను. మువ్వురు దక్క తక్కినవారెల్లరు దగ్ధులయిరి. అవ్వల రాజు వానిపైకెత్తెను. యోగిగావున యోగబలమున జలమునించి యగ్నిని శమింపజేసెను.
ఉదక రాక్షసుడగు వానిని గూల్చి యుత్తంకునికి జూపెను. అక్షయధనము – అరి విజయము ధర్మమందాసక్తి అక్షయస్వర్గవాసమను వరములుత్తంకుడాఱని కిచ్చెను. రాక్షసునిచే గూలిన కుమారులక క్షయలోకములు గలుగునట్లును వరమిచ్చెను.
వానికి మిగిలిన కుమారులు ముగ్గురు. పెద్దవాడు దృఢాశ్వుడు చంద్రాశ్వ – కపిలాశ్వులు తరువాతి వారు. ధుంధుమార కుమారుడైన దృఢాశ్వునికి హర్యశ్వడనువాడు కలిగెను. వానికి నికుంభుడుదయించే.
అతడు క్షత్రధర్మపరుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. రణవిశారదుడు. వాని తనయులు అకృశాశ్వకృశాశ్వులు. కూతురు హైమవతి, దృషద్వతి అనిఖ్యాతిగాంచెను. ఆమె కొడుకు ప్రసేనజిత్తు.
అతడు గౌరియను భార్యనుబడసెను. ఆమె మహాసాధ్వి. భర్తృ శాపముచే నామె బాహుదయనునదియయ్యె. అతని కొడుకు యువనాశ్వుడు వాని కొడుకు మాంధాత. త్రిలోక విజయి యాయన.
అతని భార్య చైత్రరథి. శశిబిందుని కూతురు సాధ్వి. బిందుమతియనుపేరుకలది. పరమసుందరి పదివేలమంది కామె యప్పగారు. ఆమె యందు మాంధాత యిర్వురు కుమారుల గనెను.
పురుకుత్సుడు ముచికుందు డనువారు వారలు. పురుకుత్సుని సుతుడు త్రసదస్యుడు. నర్మదయందు గలిగినవాడు. వానికొడుకు సంభూతుడు. వాని కుమారుడు త్రిధన్వుడు. శత్రుమర్దనము జేసినవాడు.
ఆయనతనయుడు విద్వాంసుడు త్రయ్యారుణుడు ప్రభువు. వాని కుమారుడు సత్యవ్రతుడు మహాబలాశాలిక్రూరుడు. పరిగ్రహణ మంత్రములకు విఘ్నముల కల్పించి మరొక్కని భార్యను హరించినవాడు.
బాల్యము చేత కామముచే మోహముచే సాహసముచే చాపల్యముచే వాడంతః పురమున నివసించు నొక గృహస్థుని కన్యను హరించెను. త్రయ్యారుణుడు అ యధర్మశంకచేత క్రోధసమన్వితుడై అతనిని నిందించి పరిత్యజించెను.
నేనెక్కడకు బోదునని వాడనెను. నీవు శ్వపచులతో గూడియుండుమని తండ్రియనెను. నీవు కులపాంసనుడవు. నీచే సేను పుత్రవంతుడ గాననియె. వాడు తండ్రిమాటను బట్టి నగరమును వీడిపోయెను.
ఋషియైన వశిష్ఠ భగవానుడు పోవలదని వానిని వారింపడయ్యె. ఆ సత్యవ్రతుడు శ్వపాకుల పాకలదరి వసించుచుండెను. కొన్నాళ్ళకు దండ్రియు నవ్వనంబున కరిగెను. అంతట నింద్రుడా రాజ్యమున వర్షింపడయ్యె.
ద్వాదశవర్ష క్షామమేర్పడెను. విశ్వామిత్రుడు తన భార్య నాతని దేశమున వదలి సాగరాంతమున విపులత పమ్మెనరించెను. ఆయన భార్య నడిమి కొడుకును గలమందు బంధించి కొనపోయి తక్కిన బిడ్డలను బోషించుటకై నూరుగోవుల వెలకమ్మెను.
అట్లు గలమందు బంధితుడైన వాని జూచి సత్యవ్రతుడు (రాజకుమారుడు) విడిపించి యాతనిం దాను భరించెను. విశ్వామిత్రుని సంతోషపెట్టుటకు, అతని యనుగ్రహము బొందుటకు నతడట్లు సేసెను.
గలబంధనమందిన కతన నాతడు ‘గాలపుడు’ అనంబరగెను. కౌశిక మహర్షి యావీరునివలననటు విముక్తి బడసెను.
ఇది శ్రీబ్రహ్మమహాపురాణమునందు సూర్యవంశనిరూపణమను ఏడవయధ్యాయము