Home Bhakthi Brahmapuranam – 1

Brahmapuranam – 1

0
Brahmapuranam – 1
Sri Brahma puranam - 18
Brahmapuranam – 1 – బ్రహ్మపురాణం – 1 – నైమిశారణ్య వర్ణనమ్‌ –
శ్రీమాత్రే నమః
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ సరస్వత్యై నమః
ఎవనివలన నీ కనిపించెడి పంచభూతపంచీకృతము మాయాకల్పితమునైన జగమెల్ల పుట్టుచున్నదో యెవ్వనియందునికిని (స్థితిని) పొందుచున్నదో ఎవ్వనియందు చిట్టచివఱ కల్పమునందు అనుకల్పమునను లీనమగుచున్నదో యెవ్వని ధ్యానించి మునులు దృశ్యాత్మక ప్రపంచమునకు నతీతమైన, శాశ్వతమైన, మోక్షమును బొందుదురో యట్టి నిత్యమైన నిశ్చలమైన స్వయంప్రకాశమైన పురుషోత్తముడని పిలువబడు స్వచ్ఛమైన తత్వమును పరమాత్మను నమస్కరించుచున్నాను.
ఎవనిని శుద్ధుని (గుణరహితుని) యాకాశమువలె సర్వవ్యాపకుని సమాధిసమయమందు జ్ఞానులు ధ్యానింతురో యట్టి నిత్యానందస్వరూపుని ప్రసన్నుని , నిర్మలుని నిర్గుణుని సర్వేశ్వరుని వ్యక్తావ్యక్తస్థితికి నతీతమైన వానిని ప్రపంచశూన్యుని (ద్రష్టయైన వానిని) ధ్యానమాత్ర గమ్యమైన ప్రకాశరూపుని , జనన మరణాత్మకసంసార వినాశ హేతువైనవాని నజరుని మోక్షమనుగ్రహించువానిని (ముకుందుని) హరిని ధ్యానింతును.
అది మిక్కిలి పుణ్యవంతమైన నైమిశారణ్యము. పవిత్రభూమి. పరమసుందరము. మునిజనసమ్మర్దము. పలురకముల పువ్వులతో శోభించుచున్నది. సరళ=తెల్లతెగడ, కొండగోగు, పనస, ధవ=ఉమ్మెత్త, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ మఱ్ఱి, దేవదారు,
రావి, పారిజాత, చందన, అగరు, పాటల (కలిగొట్టు) వకుల (పొగడ) సప్తవర్ణ (ఏడాకుల
అరటి), పున్నాగ సుర పొన్న నాగకేసర=నాగకింజల్కము శాల=బొద్దుగ తాల (తాడి) తమాల (చీకటిమ్రాను) నారికేళాది అర్జున (జువ్వి) మహావృక్షములతో, చంపకాది (సంపెంగ) లతలతో శోభితము, వినిధపక్షిమృగకుల సంకులము, నానావిధ పుణ్యసరస్సులు దిగుడుబావులతో శోభిల్లుచున్నది.
బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు, బ్రహ్మచర్యాది నాల్గాశ్రమములవారు స్వధర్మానుష్ఠానునిరతులై యందు వసింతురు. సర్వసంపన్నమైన గోసంపదతో నది రాణించును. యవ గోధుమ చణక (సెనగలు) మాష (మినుము) ముద్గ= (పెసర) తిల=(నువ్వు) ఇక్షు=చెఱకు మెదలగు సస్యములతో నిండినది.
అందగ్నిహోత్రుడు ఆజ్యాదిహవిర్హోమములచే నుద్దీపింప నైమిశారణ్యవాసులగు మునులారంభించిన ద్వాదశవార్షికసత్రయాగమునకు మునులు మఱి ద్విజు లెందఱో యేతెంచిరి. వారివారికి యజమానులు యథోచితపూజలాచరించిరి.
ఋత్విక్కులతో వారు యజ్ఞసదస్సునందాసీనులై యుండ బుద్ధిమంతుడు లోమహర్షణుడను సూతు డరుదెంచెను. మునివరు లాయనం గని ముదముతో పూజించిరి. ఆయనయు వారికి బ్రతిపూజచేసి వా రిడినయాసన మలంకరించెను. ఋషు లన్యోన్య ప్రసంగములు కావించిరి.
ఋత్విక్కులతో సదస్సులతో గోష్ఠి అయిన తరువాత యజ్ఞదీక్షితు లాయన నిట్లు ప్రశ్నించిరి. సాధూత్తమ వేదశాస్త్రపురాణములందు భారతేతిహాసమందు మోక్షశాస్త్రమగు భాగవతమునందును నీవు సర్వము తెలిసినవాడవు.
దేవతల యొక్కయు దైత్యుల యొక్కయు జన్మకర్మ వృత్తాంతములు నీకు తెలియనిలేవు. సురాసుర యక్ష గంధర్వ పన్నగ రాక్షస వర్గముతోడి యీ సృష్టి యెట్లు జరిగినది? ఎట్లు పెరిగినది ఎట్లంతమయినది వినదలంతు మానతిమ్ము.
Brahmapuranam - 1
Brahmapuranam – 1

లోమహర్షణుడిట్లనియె

అవికారుడు=షడ్భావవికారములు 1.ఉనికి, 2. పుట్టుట. పెరుగుట, 4. తఱుగుట, 5. పరిణమించుట (మార్పుచెందుట) 6. నశించుట అను నాఱు వికృతులు లేనివాడు, శుద్ధుడు (ఎట్టి గుణసంగము లేనివాడు) నిత్యుడు నిత్యసత్తాస్వరూపుడు విష్ణువు (సర్వ వ్యాపకుడు) సర్వము జయించువాడు హిరణ్యగర్భుడు సృష్టికర్త హరి శంకరుడు. వాసుదేవుడు సర్వదేవతలకు (జ్యోతిస్వరూపులకు) నివాసమైనవాడు తరింపజేయువాడు సృష్టిస్థితిలయములనుజేయువాడు ఏకరూపము నానారూపము తానేయైనవాడు స్థూలము=సాకారసగుణరూపము. సూక్ష్మము=అంతర్యామి జ్ఞానరూపమునైనవాడు. ఆవిధముగ వ్యక్తము అవ్యక్తమునైనవాడు ముక్తికి కారణమైనవాడు, జగన్నిర్మాణపరిపాలనలయములు చేయువాడు, అజరుడు ముదిమిలేనివాడు, అమరుడు, మరణములేనివాడు, సర్వమూలము (బీజము) నైనవాడు నైన యా పరమాత్మకు నమస్కారము. నమస్కరించుట యనగా ప్రహ్వీభావము విధేయుడననుట అభేదాను సంధానముకూడ.
ప్రపంచమున కాధారమైన వాడు అణువుకంటె నణువైన వాడు సర్వభూతములందుండు వాడు అచ్యుతుడు, జ్ఞానమూర్తి మిక్కిలి స్వచ్ఛమైనవాడు పరమార్థముగ నిర్మలుడు (గుణసంగములేనివాడు) భ్రాంతిదృష్టికి జగముగ (వస్తువుగ) దోచువాడు సర్వవ్యాపకుడు సర్వము కబళించువాడు సృష్టిస్థితులజేయు స్వతంత్రుడు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పుట్టుట హానివృద్ధులు లేనివాడు ఆద్యుడు మిక్కిలి సూక్ష్మమయినవాడు నగు విశ్వేశుని బ్రహ్మాదులకు నమస్కరించి ఇతిహాస పురాణవేత్త వేదవేదాంగ పారగుడు సర్వశాస్త్రతాత్పర్యరహస్యమెఱిగినవాడు పరాశరకుమారుడు నగువ్యాసభగవానుని నా గురుని మ్రొక్కి వేదతాత్పర్యమయిన పురాణమును జెప్పుచున్నాను.
మును దక్షాది మునులడుగగ బ్రహ్మ పలికిన కథ పాపహర మిదే చెప్పెద వినుడు. ఇది యర్థగంభీరము బహుచిత్రము వేదార్థ విస్తరము. దీని నెపుడు ధారణజేయువాడును, వినునతడును స్వవంశోద్ధరణ మొనరించి స్వర్గమందాదరింపబడును.
తెలియరానిది యవ్యక్తము సర్వకారణము నిత్యము నున్నదియు లేనిదియునైనది ప్రధాన మొకటి గలదు. దానినుండి విశ్వమును సృజించెను.
అదియెతత్త్వము బ్రహ్మ. సర్వభూతస్రష్ట, ఆతడు నారాయణపరాయణుడు. అదిమ మహత్తత్వము (బుద్ధి) అందుండి యహంకారము అందుండి భూతములు (5) జనించెను.
వాని స్థితిభేదమును బట్టి వివిధ భూతకోటి పుట్టినది. ఇదియ సనాతనమగు ధర్మము సర్గము (సృష్టి) మీకీర్తి నినుమడింపజేయునది ఇవె యీ సృష్టి విలాసము. నా విన్నంత శ్రుతులవలన నా తెలిసినంత సవిస్తరముగ విన్నవింతు వినుండు. ఇది కీర్తిశాలుర కెల్లరకు పుణ్యము బెంచును.
ఆ మీద స్వయంభువు (బ్రహ్మ) తొలుత అప్పులను సృజించెను. అప్పులు అనగా ప్రకాశోదకము. అందు తన వీర్యమును వదలెను. వీర్యమనగా సృష్టి సంకల్పము. ”సఐక్షత బహుస్యాం ప్రజాయేయేతి” అనగా తానే బహురూపములుగా పుట్టవలెనని చూచెను. అని ఈ సంకల్పమునే వేదము తెల్పినది.
అప్పులకు నారములనిపేరు. అవి నరులసృష్టికి మూలములు. అవి మొదటి గమ్యస్థానము లయినందున ఆయన నారాయణుడను పేరొందెను.
ఆయన వదలిన వీర్యము బంగారు గ్రుడ్డయి అప్పుల యందు (ఉదకములందు) తేలినది. ఆ ఆండమునందు బ్రహ్మ తానే స్వయంభువు అనుపేర జనించెను. అందుచే నాయనకు ”హిరణ్యగర్భుడనుపేరు వచ్చెను.
ఆ హిరణ్యగర్భుడు ఒక పరివత్సరమట్లే యుండి యబ్రూపమైన తత్వమును దివము. భువమనుపేర రెండుగా నొనరించెను. ఆ రెండుశకలములనడిమి యవకాశమును నాకాశముగ గావించె.
అప్పులందు మునిగిన భూమిని దేల్చి దిక్కులను బదింటిని గల్పించెను. అందే కాలము మనస్సు వాక్కు కామము క్రోధము రతియనువానిని సృజించెను.
ఆ రూపమున సృష్టిని గావింపనెంచి మరీచి అత్రి అంగిరస్సు పులస్త్యుడు పులహుడు క్రతువు, వసిష్ఠుడు నను వారిని మనస్సుచేత సృజించెను. వీరు సప్తబ్రహ్మలను పేర ప్రసిద్ధి చెందిరి.
ఈ సప్త బ్రహ్మమానసపుత్రులకంటె ముందే బ్రహ్మ తన రోషమునుండి రుద్రుని సృజించెను. పూర్వులకెల్ల బూర్వుడయిన సనత్కుమారుని గూడ సృజించెను. మును చెప్పిన సప్తబ్రహ్మల నుండి ప్రజలు రుద్రులు జనించిరి.
స్కందుడు సనత్కుమారుడును దమ తేజస్సును దమలో గుప్తపఱచుకొని యుండిరి. అనగా వారు సృష్టి కున్ముఖులు కారైరి. సప్తబ్రహ్మల వంశములు దేవతలు దేవగణములతో గూడినవి.
వారందరు క్రియావంతులు నగు గృహస్థులైరి. మహర్షులపరంపర యిదియే, బ్రహ్మ మెఱుపులను పిడుగులను మేఘములను లోహితములను ఇంద్రధనుస్సును పక్షులు మొదలగువానిని సృజించెను.
యజ్ఞార్ధము ఋగ్యజుస్సామవేదములను జనింపజేసెను. సాధ్యులను గనెను. ఆయనమేనినుండి యుచ్చావచములగు భూతములెన్నో పొడమెను.
అట్లుగావించు తనసృష్టి వృద్ధిబొందకుండుటగాంచి తనశరీరమునే రెండు గావించి సగభాగమును పురుషుడు సగభాగమున స్త్రీయు నయ్యెను. ఆ స్త్రీయందాతడు వివిధప్రజలను గనెను.
అతడు భూర్భువ ర్లోకములను వ్యాపించి విష్ణువని పేరందెను. ఆయన విరాట్పురుషుని సృజించెను. అతడు మనువును సృజించెను. అతడు మనువును సృజించెను. ఆయన తరమే మన్వంతరము.
బ్రహ్మమానస సృష్టిలో నిది రెండవది. ఆ మనువు ప్రజాసర్గ మొనరించెను. నారాయణుని విసర్గ మిది. ఈ సృష్టిలోని సంతానముకూడ నయోనిజమె బ్రహ్మపురాణమందాది సర్గమను దీనిని దెలిసిన యతడు ఆయుష్మంతుడు కీర్తిమంతుడు నగును. సంపూర్ణ ప్రజ్ఞావంతుడై యభీష్టగతి నొందును.
ఇది బ్రహ్మ పురాణమున ప్రథమాధ్యాయము.

Leave a Reply

%d bloggers like this: