Home Bhakthi Sri Veerabhadraswamy Temple – Lepakshi

Sri Veerabhadraswamy Temple – Lepakshi

0
Sri Veerabhadraswamy Temple – Lepakshi
Sri Veerabhadraswamy Temple - Lepakshi

Sri Veerabhadraswamy Temple – Lepakshi – శ్రీ  వీరభద్రస్వామి  ఆలయం :  లేపాక్షి

“లేపాక్షి బసవయ్య! లేచి రావయ్య – అని అడవి బాపిరాజు గారు ఒక కవితలో పిలుపునిచ్చారు. ఆ బసవయ్య వెలసిన లేపాక్షి అనంతపురం జిల్లాలో వుంది.
ఏ క్షణాన లేచి ముందుకు ఉరుకుతుందోనని అనిపించే విధంగా చెక్కిన సజీవ శిల్పం ఈ నందీశ్వరుడు.
లేపాక్షిలోని వీర భద్రాలయం సమీపంలో 15 అడుగుల ఎత్తున, 22 అడుగుల పొడుగున విస్తరించివుందీ బ్రహ్మాండమైన విగ్రహం.
స్కంద పురాణంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి. ఉగ్రరూపంలో ఉన్న శివుడి ఝటాజూటం నుంచి పుట్టినవాడే వీరభద్రుడు.
అగస్త్య మహామునే స్వయంగా వీరభద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఆయన తపస్సు చేసిన గుహ కూడా గర్భగుడికి పక్కనే ఉంది.
 ఇక్కడగల పాపనాశేశ్వర స్వామి (లింగరూపం) అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికెదురుగా మరొకరుగా పాపనాశేశ్వరుడు (శివుడు), రఘనాధమూర్తి (విష్ణువు) వుండటం యిక్కడ ప్రత్యేకత..

 లే…పక్షి ! 

 అనంతపురం జిల్లా హిందూపూర్కు 14 కి.మీ దూరంలో బెంగళూరుకు 122 కి.మీ దూరంలో ఉంది లేపాక్షి.
తాబేలు ఆకారంలో ఉన్న కూర్మ శైలమనే చిన్న కొండమీది ఆలయ సముదాయమే లేపాక్షి. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని పోతుండగా జటాయువు అడ్డగించిందట.
రావణుడు దాని రెక్కలు నరికివేయడంతో అది ఇక్కడే పడి పోయింది. సీతను వెతుకుతూ వచ్చిన రాముడు జటాయువుని చూసి జాలితో ‘లే పక్షీ’ అని పిలిచి  మోక్షం ప్రసాదించిన స్థలం.
అదే లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు.
విజయనగర చక్రవర్తి అయిన అచ్చుత దేవరాయల ఖజానాకు అధికారిగా విరూపణ్ణి అనే సెట్టి వుండేవాడు. అతని సోదరుడు వీరణ్ణి.
ఇద్దరూ లేపాక్షి ప్రశస్తిని విని ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అందులో తమ కులదైవమైన వీరభద్రుని ప్రతిష్టించారు.
Sri Veerabhadraswamy Temple - Lepakshi
Sri Veerabhadraswamy Temple – Lepakshi
కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దుతున్న కాలంలో దేవాలయ నిర్మాణానికై రాజుగారి ఖజానా నంతటిని విరూపణ్ణ వాడేశాడని నేరారోపణపై అతని కన్నులు పొడిచి వేయవలసిందిగా రాజుగారు ఆదేశించారట.
ఇది విని విరూపణ్ణ తన రెండు కనుగ్రుడ్డులనూ తనే పెరికి వేసికొని గోడకేసి కొట్టాడట. గోడపై రెండు గుంటలు, ప్రక్కన ఎర్రటి నెత్తుటి మరకలు యిప్పటికీ కనిపిస్తాయి.
లేపాక్షి అంటే అంధీకృతాక్షి గ్రుడ్డిదైపోయిన కన్ను అన్న అర్థం కూడ కొందరు చెబుతారు.
లేపాక్షి ఆలయం శిల్పాలకు, చిత్రాలకు కూడ ప్రసిద్ధి ఇక్కడి స్తంభాలలో ఒకటి నేలకానకుండా నిలిచి వుండే విధంగా నిర్మించారు. స్తంభం అడుగునుండి ఉత్తరీయం పరచి చూడవచ్చు.
దేవాలయములోని రంగు మండపం ఎంతో రమణీయమైనది. ఇది నిజంగా నాట్యమండపం అనవచ్చు. బ్రహ్మ మృందంగాన్ని, తుంబురుడు వీణను, నందికేశ్వరుడు హుడుక్కను, దేవతలలో ఒకరు తాళాన్ని వాయిస్తుంటారు. రంభ నాట్యం చేస్తుంటుంది.
ఈ మూర్తులన్నిటినీ వేర్వేరు స్తంభాల మీద చెక్కారు. భిక్షాటన మూర్తియైన శివుడు పార్వతినుండి భిక్ష అడిగే సన్నివేశాన్ని మనోహరంగా చెక్కటం మనం గమనించవచ్చు.

అతి పెద్ద నంది విగ్రహం 

లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.23 మీటర్ల పొడవూ, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది.
కాసుల పేరూ చిరుమువ్వలూ, గంటలతో శోభాయమానంగా అలంకరించినట్లుగా చెక్కిన నంది విగ్రహాన్ని ఎంత చూసినా తనివితీరదు. మూపురం మీద శాలువా కప్పినట్లుగా చెక్కారు.
నాటి విజయనగర శిల్పుల నేర్పరితనానికి ఆశ్చర్యపోవడం సందర్శకుల వంతవుతుంది. నందీశ్వరుని చెవులు రిక్కించి ఉన్నాయి.
గర్భగుడికి ముందు తూర్పువైపు పాపనాధీశ్వరుడు, పడమటివైపు రఘునాథస్వామి ఆలయాలు ఉన్నాయి.
శైవులూ, వైష్ణవులూ మా దేవుడే గొప్ప అని కొట్లాడుకునే రోజుల్లో శివకేశవులు ఎదురెదురుగా ఉండటమూ, శివుడు కాకుండా వీరభద్రుడు మూలవిరాట్టుగా ఉండటమూ లేపాక్షి ప్రత్యేకత.
ఇక్కడ ఉన్న మండపంలోని స్తంభాలమీద సైతం శివకేశవుల రూపాలు పక్కపక్కనే చెక్కడం చెప్పుకోదగ్గ విషయం.
ఓ స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్యపూజలు నిర్వహించడం మరో విశేషం.
గర్భగుడి ప్రాకారంలో తూర్పువైపుకి రాగానే ఆరు అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం మనల్ని ఆకర్షిస్తుంటుంది. పక్కనే బండమీద శివలింగానికి సాలెపురుగు, సర్పం, ఏనుగు,భక్త కన్నప్ప పూజ చేస్తున్న దృశ్యం కన్పిస్తుంది.
సమీపంలోనే ఏడు పడగలతో మూడు చుట్టుల మధ్యన శివలింగంతో ఉన్న నాగ లింగాన్ని చూడగానే ఎంతటివారైనా గగుర్పాటుకు లోనవుతారు.
నాగలింగానికి ఎదురుగా ఓ వంటశాల ఉండేది. ఓ రోజు ప్రధాన శిల్పుల తల్లి వంట చేయడం ఆలస్యమైందట. అది పూర్తయ్యేలోగా సమయం వృథా కాకుండా శిల్పులు నాగలింగాన్ని మలిచారట. అది చూసి ఆమె ఆశ్చర్యపోగా ఆమె దృష్టి తగిలి విగ్రహానికి చీలిక ఏర్పడిందని చెబుతారు.
ఆ దగ్గర్లోనే ఆంజనేయస్వామి వారి కుడిపాదం ఉంటుంది. ఆ కాలిబొటన వేలి నుంచి అన్ని కాలాల్లోనూ నీరు రావడం విచిత్రం.

Leave a Reply

%d bloggers like this: