Home Bhakthi Dattatreya Swami Jayanti

Dattatreya Swami Jayanti

0
Dattatreya Swami Jayanti
Dattatreya Swami Jayanti

Dattatreya Swami Jayanti – దత్తాత్రేయ స్వామి జయంతి – శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.

దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||

భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||

శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.

దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది.

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ , సర్వస్వతి , పార్వతిమాతలు , మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు.

నారద మహర్షి అనసూయ “పాతివ్రత్యాన్ని” (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ – విష్ణు – శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు , ఈర్ష్య , అసూయ , ద్వేషమనే దుర్గుణలకు లోనయితే !

దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికో , శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకడానికో ! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి.

వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు.

త్రిమూర్తూలు ఎంతవారించినా , పెడచెవిని పెట్టారు ససేమిరా ! అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు.

వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది , వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది.

లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి.

వన్యప్రాణుల కేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో ? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రాగాలు చేయసాగాయి.

Dattatreya Swami Jayanti
Dattatreya Swami Jayanti

ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు , మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి.

ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో , మనం ముగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ మునిబాలకులతో కలిసి ఆడుకుంటే ! ఎంతబాగుండునో ! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు.

అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం , అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.

మహా తపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి , దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని , ముని శ్రేష్టుడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు.

అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ , అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన “పతి సేవతత్ పరతచే” పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ , పంచభూతాలు , అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతా తల్లిని , దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు.

ఆ సాధుపుంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు , సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి , అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ , విష్ణు , మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు , భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ !

అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు అ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.

ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన “భర్త” ను మనసారా నమస్కరించుకుంది. “పాతివ్రత్యజ్యోతి” వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు అయింది.

వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ! ఏమి నా భాగ్యము ! ముల్లోకాలను ఏలే సృష్టి , స్థితి , లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా ?

వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా , అని ఆలోచిస్తూ ! ఒక ప్రక్క పాతివ్రత్యం , మరోవైపు అతిథిసేవ.

ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా ? అనుకుంటూ పతికి నమస్కరించి “ఓం శ్రీపతి దేవయనమః” అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది.

వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు ! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది.

ఇంతలో ఋషి కన్యలు , ౠషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా ! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది.

“ఇంతటి మహద్భాగ్యం” సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి…. ! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకుని , తన దివ్య దృష్టితో జరిగినది , జరగబోతున్నది గ్రహించుకున్నాడు.

ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే ! కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి !

ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో , ఆడుతూ గెంతుతూ అ మునిబాలకులతో , కలిసి వారి కలలను పండించుకోసాగారు.

మానవులకు బాల్య , కౌమార , యవ్వన , వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు.

కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.

ఇలా ఉండగా ! లక్ష్మీ , సరస్వతి , పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు.

దానితో అనసూయపై ఏర్పడిన “ఈర్ష అసూయ – ద్వేషాలు” పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు.

వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి , ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది ! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి , స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.

పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే ! మీ మీ భర్తలను గుర్తించి ! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది.

ఒకే వయస్సుతో , ఒకేరూపుతో , అమాయకంగా నోట్లో వేలువేసుకోని , నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు ? ఎవరో ? గుర్తించుకోలేక పోయారు.

తల్లీ ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని “ఈర్ష్య , అసూయ , ద్వేషాలతో !” మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన !

త్రిమూర్తులు సాక్షాత్కరించి , ఈ ఆశ్రమవాస సమయమందు , మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు.

నాయనలారా ! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు ! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు.

అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ , విష్ణు , బ్రహ్మ అంశలతో దూర్వాసుడు , దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది.

ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత ! బ్రహ్మ , శివుడు వారి వారి అంశలను “దత్తనారాయణు” నికి యిచ్చారు.

అప్పటి నుండి ఆ స్వామివారు “శ్రీ దత్తాత్రేయ” స్వామిగా అవతార ఎత్తారు. ఆంద్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోరల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు , తెప్పాల చెక్కలు ఆహరం పెట్టటం సాంప్రదాయం.

check Karthika Purana – Chapter 4 :

Leave a Reply

%d bloggers like this: