
Sri Karthika Purana – Chapter 22 – శ్రీ కార్తీక పురాణము – 22వ అధ్యాయము – పురంజయుడు కార్తీకపౌర్ణమి వ్రతమును చేయుట – పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికిపోయి స్నానమాచరించి తన గృహమునకెరిగెను.
అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్దబ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి ” రాజా! విచారింపకుము, నీవు వేంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడదీసుకొని, యుద్దసన్నద్దుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును”.
అని దీవించి అదృశ్యుడయ్యెను. ” ఈతనెవరో మహానుభావునివలె వున్నాడు. అను ఆ వృద్దుని మాటలు నమ్మి యుద్దసన్నద్దుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను.
దెబ్బతిని క్రోథముతో వున్న ఫురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్నివిధములా సహాయపడెను.

అంతా శ్రీమన్నారాయణుని మహిమయే గదా! ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి ” పురంజయా రక్షింపుము రక్షింపుము” అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను.
శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగునా! విషము త్రాగినను అమృతమైనదిగదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా!
హరినామస్మరణ చేసినవారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మము అగును. త్రాడు పామై కరచును.
కార్తీకమాసమంతా నదీస్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును.
విష్ణుభక్తి కలిగి శ్రద్దతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతివారికైననూ పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును.
వేదాధ్యయన మొచరించి దైవభక్తి కలవాడై కార్తీకవ్రతానుష్థాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును.
సంసార సాగర ముత్తరించిటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు.
సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తిలేనియెడల వారు తమ ద్రవ్యములను వెచ్చించియైననూ మరొకరిచేత దానధర్మలు వ్రతములు చేయించవచ్చును.
శ్రీహరి భక్తులు అన్యోన్య సంబధీకులు. అందువలన లోకపోషాకుడు, భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండును.
శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. సూర్యభగవానుల తేజస్సుగలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పదునాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు.
అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీకమాసవ్రతము భక్తిశ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవి సమేతుడై వెలయగలడు.
ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచియై పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికీ నిజము.
22వ అధ్యాయము సమాప్తము
check Vaishakha Puranam – Chapter 4 వైశాఖ పురాణం – 4 వ అధ్యాయము