Karthika Puranam – Chapter 20 – కార్తీక పురాణం – 20 వ అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట – జనక మహారాజు , చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో “గురువర్యా ! కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా ! యను సంశయము గూడా కలుగుచున్నది.
ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు” డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో “ఓ రాజా ! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి , అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు” మని అ కథా విధానమును ఇట్లు వివరించిరి.
పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి , “ఓ అత్రిమహామునీ ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును , కాన దానిని నాకు వివరింపుము” అని కోరెను.
అంత అత్రిమహముని *”కుంభసంభవా ! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరమగుటచే ఉత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము.
వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు.

ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను , శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను , లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము.
త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను.
ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను , రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని , పరమలోభియై , చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను.
ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ , కొంకణ , కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ , గజ , తురగ , పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి , నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భంధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను.
అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి , చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై – వారిని యెదుర్కొన భేరి మ్రోగించి , సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము – ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.
check Sri Karthika Puranam – Chapter 14 :