Home Current Affairs Today is Telugu Language Day :

Today is Telugu Language Day :

0

Today is Telugu Language Day –  ప్రతి ఏడాదీ ఆగస్ట్ 29న తెలుగు భాషా దినంగా జరుపుకుంటూ తెలుగుకి పడుతున్న తెగులు గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాం. తెలుగు మాటలకి ఇంగ్లీషులో అర్థం చెబితేగాని అర్థంచేసుకోలేని తెలుగువారి సంఖ్య పెరిగిపోతున్న ఈ కాలానికి మే 5, 2015“వన్ ఇండియా తెలుగు(సాహితి వ్యాసం)”లో వచ్చిన నా వ్యాస భాగం సంగతమని భావిస్తూ మీఅందరితో పంచుకుంటున్నాను. మితృలు ఆసక్తి చూపితే మొత్తం వ్యాసాన్ని ఇవ్వగలను.

మన ‘తెలుగు’ భాష : మనిషికోమాట
దాసు మధుసుదన రావు
“అసమాన ప్రియ నీతివర్తనము, ప్రాణాంతంబునందు౯ మలీ
మనమగ్రాహ్య, మదుష్టయాచన, మసంపత్ప్రార్థనాభావము౯,
వ్యసనావాప్తిని ధైర్యముం, బుధజనాత్యంతానుకూలత్వ; మీ
యసిధారావ్రతచర్యయెవ్వడు మహార్యశ్రెణికిం దెల్పెనో”!

నీతివంతమైన జీవితం గడపుట, ప్రాణాపాయస్థితిలోనైనా చెడ్డపనులు చేయకుండుట, చెడ్డవారి సహాయం కోరకుండుట, మంచివాళ్ళకు అనుకూలముగానుండుట మొదలైనవి ’మహార్యశ్రేణికిన్” అంటే ’జెంటిల్మెన్ (పెద్దమనుషుల)’కి సహజంగా ఉండే లక్షణాలని భర్తృహరి (సంస్కృతంలో) చెప్పినదానిని ఏనుగులక్ష్మణకవి పైపద్యంలొ అందరికీ అర్ధమయ్యేలాగా చెప్పాడు.

“తెలుగువాళ్ళకే స్వంతమైన పద్యాలను పెద్దలు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి” తద్వారా “తెలుగు తల్లి ఉనికిని కాపాడండి” అని గానగంధర్వుడు మన యస్ పి బాలసుబ్రహ్మణ్యం వారం వారం తియ్యగా పాడుతూ చెబుతూ ఉంటారు.

తెలుగుభాషకి అంతరించిపోయేంత పరిస్థితి దాపురించడానికి ముఖ్య కారణం మన ’డైలీలైఫ్’లో, క్షమించాలి, మన దైనందిన జీవితంలో తెలుగు వాడకం క్రమక్రమంగా తగ్గిపోతూరావడమే. Today is Telugu Language Day

దీనికి తార్కాణం ఈ మధ్య నాకెదురైన అనుభవాలే. ఒకసారి ఒక ’మహాంగడి’ (లేక బహుళార్థాంగడి అనే సూపర్ మార్కెట్)కి వెళ్ళి కందిపప్పు కావాలని అక్కడున్న అమ్మాయి (తెలుగుపిల్లే)నొకెత్తెను అడిగితే, ఆ పిల్ల “ఓ తూర్ దాలా సార్” ఇదిగోండి అని తీసి ఇచ్చింది.

ఇంకొకసారి అలాంటి అంగడిలోనే బీరకాయలు కొని ’గల్లాబల్ల’ (క్యాష్ కౌంటర్) దగ్గర డబ్బు ఇవ్వబోయాను. అప్పుడక్కడున్నపిల్ల (మళ్ళీ తెలుగుపిల్లే) నాచేతిలోని కాయల ధర తెలియక “ఈ రిట్జ్ గోర్డ్” (Ridge gourd) ‘రేటెంతో’ చెప్పమని పక్కనున్న తన సహోద్యోగినిని అడిగింది. నేను అవాక్కయ్యాను.

ఇక కుతూహలం చంపుకోలేక అక్కడ గోడలకమర్చిన అరలలో చూశాను. పప్పులూ, ఉప్పులూ ప్లాస్టిక్ పొట్లాలలో అందంగా అమర్చి ఉన్నాయి.

వాటిలో కొన్నిటి మీద ’మూంగ్ దాల్’ (Green gram) అనీ, కొన్నిటి మీద ’ఊరద్ దాల్’ (Black gram-split) అనీ, మరి కొన్నింటి మీద ’చన్నా దాల్’ (Bengal gram) అనీ ఆయాపొట్లాలలో ఉన్న వస్తువుల హిందీ పేర్లూ, ఇంగ్లీషు పేర్లూ రోమన్ లిపిలో రాసి ఉన్నాయిగాని ఒక్క పొట్లం మీదా పెసరపప్పు అనిగాని, మినపపప్పు అనిగాని, శనగపప్పు అనిగాని రాసిలేదు.

Today is Telugu Language Day
Today is Telugu Language Day

ఇక కూరగాయల సంగతి సరేసరి, ’ఓక్రా’లూ, ’బైంగన్’లూ ఉన్నాయి గాని, మన బెండకాయలు, వంకాయలు లేవు.
ఒక్క మాట్లాడే భాషే కాదు, మనం పెట్టుకొనే పేర్లు, వేసుకొనే బట్టలు, మనం తినే తిండి కూడా అన్యదేశ్యాలైపోతున్నాయి.

సుబ్బలక్ష్మి, కనకదుర్గలు పోయి మౌనిక, అనూషలు; సుబ్బారావు, సత్యనారయణలు పోయి నిహాల్, రాహులులు వచ్చాయి. చీరకట్టు, పంచ చుట్టు పోయి పంజాబీడ్రెస్సులు, కాశ్మీరీ షేర్వాణీలు వచ్చాయి.

చిరుతిళ్ళైన పుణుగులు, బజ్జీలు పోయి నూడుల్సు, చాట్ మసాలాలు వచ్చాయి.

అలాగే పెళ్ళిపేరంటాలలో తెలుగు వంటకాలు పొయి పనీర్ మసాలాలు, మంచూరియాలు, బర్గర్లు, పిజ్జాలు వచ్చాయి. ఆఖరికి తెలుగు చలనచిత్రాలలో పాటలు సైతం ఇంగ్లీషు, హిందీపదాలతో నిండిపోతున్నయి.

ఈవిధంగా ఇంగ్లీషు, హిందీల తాకిడికి తట్టుకొని మనభాష అనవసరమైన అన్యపదాలతో సంకరం కాకుండా, తెగులు పట్టని తెలుగులాగా బతికి బట్ట కట్టాలంటే గట్టి ప్రయత్నమే చేయాలి.

ఒక్క వ్యక్తులే కాకుండా మన ప్రసార మాధ్యమాలుకూడా సహకరించాలి. అసలు ఈ సమస్య కొత్తగా వచ్చిందేమీ కాదు.

సుమారు యాభై అరవై ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక సందర్భంలో, “ఆశీర్వదించడానికి సంస్కృతమూనూ, తిట్టడానికి ఇంగ్లీషూ అయితే మరి మన తెలుగెందుకు?

కూరలు బేరం ఆడుకోడానికా’? అని బాధపడ్డారు. ఆయన ఇప్పుడు ఉండిఉంటే సంస్కృతంకూడా పోయి శాపనార్థాలకే కాకుండా దీవెనలకీ ఇంగ్లీషే వాడుతున్నందుకు సంతోషించేవాడో, లేక తెలుగు మరింతగా వెనకబడుతున్నందుకు విచారించేవాడో తెలియదు.

ఇలాగ పెను ప్రమాదంలో ఉందనుకుంటూన్న తెలుగును రక్షించుకోవాలంటే తెలుగువారికే స్వంతమైన పద్యాలను ముందస్తుగా పెద్దలు నేర్చుకోవాలని మన ’పాటలమేటి’ ఆలోచన.

కారణాలేమైనప్పిటికీ, ఒకప్పటి పెద్దలకిలాగా నేటి పెద్దలకి పద్యఙ్ఞానం దరిమిలా భాషాజ్ఞానం అంతగా అబ్బినట్లులేదనటంలో అతిశయోక్తిలేదేమో.

అలాంటప్పుడు వీరి పిల్లల, అంటే నేటి బాలబాలికలు, రేపటి పౌరుల సంగతి చెప్పేదేముంది? వారి తెలుగు కలగూరగంపలాగా ఉండటంలో ఆశ్చర్యమేముంది?

అందుకే కాబోలు పెద్దల్ని ముందర నేర్చుకోమన్నది. పిల్లలదేముంది ఏమి నేర్పితే అది నేర్చుకొంటారు. వాళ్ళు వట్టి అమాయకులు. విన్నదే నిజమనుకొంటారు, చూసిందే సత్యమనుకొంటారు.

ఈమధ్య ఒక మూడు, నాలుగేళ్ళపిల్ల వీధిలో పాలవాడు గేదెనుంచి పాలు పితుకుతూండటం చూసి తన తల్లిని ’అమ్మా గేదెలు కూడా పాలిస్తాయా’ అని అమాయకంగా అడిగింది. Today is Telugu Language Day

ప్లాస్టిక్ సంచుల్లోంచీ, అట్టపెట్టెల్లోంచీ మాత్రమే పాలు రావటం చూసిన ఆ పిల్ల అలా అడగడంలో ఆశ్చర్యమేముంది?(వెనకటికి అలాంటి పిల్లవాడే ఒకడు వెన్న తెల్లగా కూడా ఉంటుందా అని అడిగాడట).

దానికి ఆ పిల్ల తల్లి అవునమ్మా ఒక్క గేదెలే కాదు ఆవులూ, మేకలూ కూడా పాలు ఇస్తాయి, ఆపాలు తాగే పెరిగి పెద్దయిన మనుషులలో కొంతమంది ’పెద్దమనుషులు’గా చలామణి అవుతూ పెత్తనం చలాయిస్తూ ఉంటారు అని అంది.

అసలీ పెద్దమనుషులంటే ఎవరు? విద్యావంతులై, నాగరకత కలిగి మర్యాదకల  వారిని పెద్దమనుషులని అంటారని నిఘంటువులు చెబుతున్నాయి.

అలాంటి ’మహార్యశ్రేణికి’ న్యాయవర్తనము, పాపపు పనులు చేయకుండుట లాంటి లక్షణాలు సహజంగానే ఉండి ఉండాలని పైన ఇచ్చిన పద్యంలో చెప్పబడింది.

అలాగైతే మరి మనచుట్టూ పెద్దమనుషులుగా తిరుగుతూ పెత్తందారులైన అనేకమంది పాలనాధికారులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయనాయకులకి ఈ మహార్యశ్రేణికి ఉండవలసిన గుణాలు వారు మాట్లాడే మాటలవల్లగాని, చేస్తున్నారనుకుంటూన్న చేష్టలవల్లగాని ఉన్నట్లుగా అనిపించటంలేదని అందరూ అనుకుంటున్నదేగా! శతకకర్త పెద్దమనుషులకుండవలసినట్లు చెప్పిన లక్షణాలు లేని ఈ పెద్దమనుషులని సినిమాకవి కొసరాజుగారు.

“పరమ గురుడు చెప్పినవాడు
పెద్దమనిషి కాడురా,
పెద్దమనిషి అంటేనే
బుద్ధులన్ని వేరురా”
అని వర్ణించారు.

అలాగే వీరి బుద్ధులన్నీ పైకి కనపడినట్లుగా ఉండవు. ఆమాటకొస్తే న్యాయంగానూ, ధర్మంగాను ఉండటం ’అసిధారావ్రతచర్య’ అని పై పద్యంలోనే ఉంది. అంటే నీతిగానూ, నిజాయితీతోనూ ఉండటం ’కత్తిమీద సాము’ అంత కష్టమన్నమాట.

ఈ మాట ’మంచిగా ఉండటంలో కష్టం’ (Difficulty of being good) అనే గ్రంథంలో గురుచరణ్ దాస్ గారు చాలా వివరంగా విశ్లేషించారు.

అందుకనే కాబోలు మన పెద్దమనుషులు, నూటికినూరుపాళ్ళు ధర్మంగా ఉండటం ఆ ధర్మరాజుకే సాధ్యం కాలేదు, మనమనగా ఎంత అనుకుని దాని జోలికే పోదల్చుకోనట్లుగా ఉంది.

వెనకటికి ఒకాయన న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళి అంతా నిజమే చేప్తానని ప్రమాణం చెయ్యమంటే, ’మేమందరం ఇలా పెమానికాలూ అవీ చేసేసి నిజాలు చెప్పేస్తూ ఉంటే మీరెందుకు, ఈ కోర్టులెందుకు; అసలు వ్యవహారాలెల్లా నడుస్తాయి’ అని విసుక్కున్నాడుట.

అలా అందరూ నీతిగా, నిజాయతీతో ఉండి, ధర్మం నాలుగు పాదాలతో నడుస్తూంటే నీతిశతకాలూ అక్కరలేదు, పురాణప్రవచనాలూ అవసరం లేదు. భూతలం స్వర్గం అయిపోదూ! … …

“రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట” అంటూ విశ్వనాథ సత్యనారాయణ సభక్తితో పొగిడిన గిడుగువారు తెలుగు భాష ముద్దుల బిడ్డడు.

19వ శతాబ్ధము చూసిన మహానుభావులలో గిడుగు రామూర్తిపంతులు ఒకరు.
పూర్వము ఉన్న సంస్కృతము, గ్రాంధికమును మార్చి జనసామాన్య వాడుక భాషలో విద్యావిధానము అమలు పరిచటానికి ఉద్యామించిటము మొదలు, గిడుగు వారి చేసిన ప్రజాహిత పనులు అనేకం. అవి ప్రజలను అక్షరాశ్యులుగా మార్చి, దేశ పురోభివృద్ధికి మొదటి మెట్టను పరిచాయి.

అంతటి ఘనకార్యాము చేసిన గిడుగువారికి అది సాకారమవటానికి ఎంతో కృషి, ఎంతో ఉద్యమముతోపాటూ ఎంతో కాలమూ పట్టింది. అసలు ఆయన జీవితం పూర్తిగా దానికే అంకితమయ్యింది.

బహూభాషా కోవిదుడు, చరిత్రమీద గౌరవము ఉన్న చరిత్రకారుడూ అయిన గిడుగువారు హేతువాది. వీరు 1863 ఆగస్టు 29న శ్రీకాకుళంలోని పర్వతాలపేటలో జన్మించారు. తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు.

తండ్రి చిన్నతనంలో మరణించటములో మేనమామ ఇంటికి వచ్చి అక్కడే చదువు సాగించారు. గిడుగు వారికి గురజాడ అప్పారావు మిత్రులు.

‘పర్లాకిమిడి రాజా’ వారి స్కూల్లో అధ్యాపకులుగా చేరి అక్కడ ఉండగా FA,BA కూడా చదివి ప్రథమశ్రేణిలో ఉతీర్ణులైనారు. వారు పని చేస్తున్న స్కూలు కాలేజీగా మారితే అందులో కూడా విద్యాబోధ చేశారు.

ఆ రోజులలో సంస్కృతముది పైచెయిగా ఉండేది. లేదంటే గ్రాంధికము. చదువుకున్నవారి సంఖ్య వెయి మందిలో కేవలము ఐదుగురు మాత్రమే. చదుటకు గ్రాంధికము అడ్డుగా ఉందని గమనించారు వారు.

గిడుగు వారి సేవను రెండు రకాలుగా చెప్పవచ్చు.
ఒకటి వారి వాడుక భాషోద్యమము.
రెండవది సవర భాషకు వారు చేసిన సేవ, ఆ భాషకు తెచ్చిన గుర్తింపు.

ఆ రోజులలో దగ్గరగా ఉండే అడవులలో గిరిజనులు సవర భాష మాట్లాడేవారు. గిడుగువారు 1892లో సవర భాష నేర్చుకున్నారు. అడవిలోకి, కొండలలోకి ఒక సవర భాష తెలసిన ‘తేడు’ అన్న వ్యక్తిని తోడు తీసుకువెళ్ళేవారు.

ఆ భాషలో పాటలు సేకరించారు. ఆ భాషకు వ్యాకరణము, నిఘంటువు వ్రాసారు. సవర భాషలో బడులు పెట్టించారు. ఆ భాష నేర్చుకునే విషయములో ఆయన తన ఆరోగ్యం కూడా లెక్క చెయ్యక జబ్బు కూడా పడ్డారు.

ఆ చలి జర్వం వలన వారి వినికిడి పోయింది. అయినా వెనుతిరగక ఆ భాషను పూర్తిగా సేకరించి భాషా నిఘంటు తయారు చేశారు.
ఆయన చేసిన ఈ సేవకు ప్రభుత్వము మెచ్చి 1913లో “రావ్ బహదూర్” అన్న బిరుదునిచ్చి సత్కరించింది.

ఈ సవర భాష మొట్ట మొదటి దక్షిణ ముండాభాష. మన దేశంలో ముండా ఉప కుటుంబానికి సంబంధించిన భాషను సశాస్త్రీయంగా పరిశీలించిన వారు గిడుగువారే. ఆస్ట్రో-ఏషియాటిక్ కుటుంబానికి చెందినది ఈ సవర భాష.

చరిత్ర మీద వీరికి ఎంతో ఆసక్తి. శాసనాలను చదివేవారు. అలా ముఖలింగ దేవాలయంలో శాసనాలను చదివి, వాటి మీద వ్యాసాలను ప్రచురించారాయన.

అలా ఎన్నో శాసనముల పరిశీలన, వ్యాస ప్రచరణ సాగించారు. ఆ శాసనము చదవటము వలన ఆ నాటి వ్యావహారికము తెలుసుకునే యత్నం చేశారు. Today is Telugu Language Day

తదనంతరం ఆయన భాషోద్యమము వైపు తన దృష్టి సారించారు. ఆయన భాషావాదిగా కాక విద్యావేత్తగా తమ ఉద్యమము మొదలుపెట్టారు.

నన్నయ్య కాలానికే కావ్యభాషకు శాసనాల్లో కనిపించే వ్యవహారభాషకు దూరం ఏర్పడుతున్నట్టు గుర్తించవచ్చు. నన్నయ్య తనకు ముందు రచనల్లో సాంప్రదాయికంగా వచ్చే రూపాలను వాడాడు.

శాసన భాషలో ఇస్తిమి, నాలుగో, ఇచ్చినాడు వంటి రూపాలు ఆకాలానికే ఉన్నాయి. లక్షణగ్రంథాలు కవిత్రయం వారి ప్రయోగాలే ఆధారంగా వెలిశాయి.

పదసాహిత్యంలో వ్యవహారరూపాలు ఎక్కువగా కనిపించినా వ్యాసకర్తలు వీటికి సాధుత్వం కల్పించలేదు. ప్రామాణికమైన వచనవాఙ్మయం తెలుగులో ఇటీవలి శతాబ్దుల్లోనే మొదలైంది.

ఇంగ్లీషుపాలనలో అచ్చుయంత్రం రావటం, స్కూళ్ళు, కాలేజీలు స్థాపించి అందరికీ అందుబాటులో వుండే నూతనవిద్యావిధానం స్థాపించటం, కథ, వ్యాసం, నవల, నాటకం మొదలైన సాహిత్య ప్రక్రియలు వ్యాపించటంవల్ల వచనభాషలో రచనల సంఖ్య పెరిగింది. దానికి కావ్యభాష అనువైంది కాదని గిడుగు వారు భాషాసంస్కరణోద్యమం చేపట్టారు.

ఆనాడు పాఠ్యపుస్తకాలు గ్రాంధికములో ఉండేవి. చిన్న తరగతులలో ఈ గ్రాంధికము పిల్లలకు అర్థమయ్యేది కాదు. ప్రజలు వ్యవహార భాషా, పుస్తకాలలోని భాషా తేడా ఎందుకని ఆయనకు అనిపించింది.

గ్రాంధికాంధ్రము పెద్ద పెద్ద పండితులకే సరిగా తెలియనప్పుడు, చిన్న పిల్లలకు విధించటమన న్యాయము కాదని వారి వాదన.
ఇరువై ఏండ్లు చదువుకొని, ఉపాధ్యాయులైన వారికి కూడా గ్రాంధికము కష్టము.

అటు వంటప్పుడు మరి చిన్న పిల్లలకు ఎంత కష్టమో కదా అని వారు ఎలుగెత్తారు. దేశభాషలలో విద్య బొధిస్తే కాని ప్రయోజనం లేదని, వ్యావహారికం కలకలలాడుతూ ఉండే జీవ భాష అంటూ తన వాదన వినిపించారు.

వ్యావహారిక భాషా పూర్వ కాలము నుంచీ ఉన్నదని ఎన్నో ఉదాహరణలు చూపుతారు గిడుగువారు.

ప్రబంధాలలో వచ్చిన వాడుక భాషా మాటల గురించి చెబుతూ
“కేశవ! యాంధ్రులు నానా
దేశంబులయందు నిలచి తెలుగుకి తత్త
ద్దేశోక్తులంట బలికిన
నా శబ్దము లన్యదేశ్య జాంధ్రము లయ్యెన్” అని అప్పకవి చెప్పలేదా? ఆంధ్ర భాషార్ణము, ఆంధ్రనామ సంగ్రహము మొదలయిన నిఘంటువులలో ఈ మాండలికాలు చేరినాయి కదా యని ప్రశ్నించారు గిడుగువారు.

ఎవరి వాడుక భాష వారు ఉపయోగింస్తారన్నది ఆయన వాదన. అది నిజం కూడా కదా.

ఈ విషయం గురించి ఆలోచించగా తెలుగు భాషాబోధనలో చాలా లోపాలనిపించాయి ఆయనకు. వాటిని సరిదిద్దటానికి స్వయంగా పూనుకున్నారు.

“స్వారాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం చిక్కు పడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుతున్నాము.

ఇటు వంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలుగ చెయ్యవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించ వలసి ఉంటుందో ఆలోచించండి” అని తన వ్యాసములో ప్రశ్నించారు.

ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వేయటానికి సంకల్పించినప్రుడు వారు గిడుగువారిని కమిటిలోకి తీసుకోలేదు. వారిని తీసుకుంటే వ్యవహారికాలు చొప్పిస్తారంటూ భయపడ్డారు.

దానికి గిడుగు వారు “మీరంతా కలసి నిఘంటువు సిద్ధం చెయ్యండి. అందులో చూపే దోషాలకు మీరు సమ్మతించిన వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దమ్మడీ వంతున నాకు పారితోషికమిస్తే చాలు!

నాకు వేల రూపాయుల ఆదాయం వస్తుంది” అంటూ సవాళ్ళు విసిరారు. వారి భాషా పరిశ్రమ అపారమైనది. ఆంధ్ర పండితుల జ్ఞానము ఎంత స్వల్పమైనదో వారి మాటల బట్టి తెలుస్తుంది.

స్కూళ్ళలో కాలేజీలలో గ్రాంధికము పాతుకుపోయింది. అప్పటికి వీరేశలింగంగారు సరళ గ్రాంధికమును ప్రతిపాదించారు. దానితో పాటూ గిడుగు వారి వ్యవహారిక ఉద్యమము ఊపందుకుంది.

గిడుగు వారు ఆంధ్ర దేశ మంతా విస్తారంగా తిరిగి ఉపన్యాసాలిస్తూ గ్రాంధికములో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు.

గిడుగు వారు ‘తెలుగు’ అన్న పత్రిక స్థాపించి ఈ విషయమై అవిశ్రాంతిగా పోరాటం సాగించారు. ఆయనకు బాసటగా గురజాడ వారు కూడా నిలబడ్డారు.

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, కందుకూరి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి మొదలైన కవులు వ్యావహారికము వైవు మొగ్గు చూపారు.

1919 లో గిడుగువారు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషాప్రవర్తక సమాజం” స్థాపించారు.
1924లో నవ్య సాహిత్య పరిషత్తు శిష్టవ్యావహారికములో ‘ప్రతిభ’ అన్న పత్రికను ప్రచరించారు.
1933లో గిడుగు వారి సప్తతి మహోత్సవం ఎంతో బ్రహ్మాండంగా జరిపారు ఆయన శిష్యులు. ‘Miscellany of Essays’ అన్న గ్రంథం వారికి సమర్పించారు.

1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా “జనవాణి” పత్రిక ఆధునిక భాషలో రాయటం మొదలుపెట్టారు. నెమ్మదిగా వచ్చిన మార్పు వలన వాడుక భాషను కళాశాలలో, పాఠశాలలో ప్రవేశపెట్టింది.

వారి కృషికి వారిని వివిధ బిరుదులు వరించాయి.
అందులో ముఖ్యంగా 1934 లో ప్రభుత్వం ‘కైజర్ ఎ హింద్‍’ అన్న బిరుదునిచ్చారు. 1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు “కళాప్రపూర్ణ”తో గౌరవించింది. Today is Telugu Language Day

పులిదిండ మహేశ్వర్ చెప్పినట్లుగా –

“ గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు
వ్యవహార భాషోద్యమ స్థాపన ఘనుడు గిడుగు

తేట తేనియల తెల్ల పాలమీగడ గిడుగు

కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు”

ఆయనకు ప్రభుత్వము ‘వ్యావహారిక భాషా పితామహుడని, సవరభాషా వాగమ శాసనుడ’ని బిరుదులిచ్చింది. ఆయన జన్మదినము “తెలుగు భాషాదినోత్సము” గా జరుపుతోంది. ఆ వేడుకలను
మనమందరము కూడా వారి జన్మదిన ఉత్సవాలుగా జరుపుకుంటున్నాము. నేటి తెలుగు భాష ఉన్న పరిస్థితులలో గిడుగువారి జన్మదిన వేడుకలు మరింతగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఈ సందర్భములో మన తెలుగు భాషను భావి తరాల వారికి అందిద్దామని మనము మరొక్కసారి ప్రతిజ్ఞ చేసుకుందాము. అలా మన మాతృభాష ఋణం తీర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.

check Today is Sanskrit Language Day :

Leave a Reply

%d bloggers like this: