
The Divine History of Sri Venkateswara – 7 2 , 73 శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర – 73 – పూలబావి – అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరంవైపున వెలసి ఉన్న బావి పూలబావిగా ప్రసిద్దిచెందింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నోరకాల పూలమాలలు ఉపయోగపడుతున్నాయన్నది విదితమే.
స్వామివారికి సమర్పించే తులసి, పుష్పం, పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు. అందుకే దీనిని పూలబావి అని పేరువచ్చింది.
చారిత్రక ప్రాశస్థ్యం నేపథ్యంలో ఈ బావిని ‘తీర్థం’గా కూడా వ్యవహరిస్తారు. సాక్షాత్తూ భూదేవి తిరుమలలో ఏర్పాటుచేసిన తీర్థం కనుక దీనికి ఆ పేరు సిద్ధించింది. అయితే కాలాంతరంలో ఈ తీర్థం ఇక్కడే నిక్షిప్తమైపోయింది.
అనంతరకాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఓ బావిని త్రవ్వగా ఈ భూతీర్థం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి, చామంతి తోటలను పెంచాడు.
తరువాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా పునః జన్మించాడని చరిత్ర చెబుతోంది. The Divine History of Sri Venkateswara – 73
శ్రీ వేంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించగా తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనపుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతుండేవాడు.
వరాహపురాణాంతర్గత వేంకటాచల మహత్యం అనుసారం ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తరమబడిన తొండమానుడు ఈ రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడు.
ఈ సమయాన తన ఉభయ దేవేరులతో ఏకాంతంలో స్వామివారు ఉన్నారు. అయితే తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ, భూదేవి అమ్మవారు సిగ్గుతో బావిలో దాక్కున్నారని తెలుస్తుంది.
శ్రీ వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం భగద్రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణ నేపథ్యంలో ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి తీర్థ్ధాపతిగా స్వామివారికి అరచనాది నివేదనలు జరుగుతున్నాయని అంతేగాక స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని (పూమాలలు, తులసిమాలలు వగైరా) భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలియజెప్తున్నది.
శంఖనిధి – పద్మనిధి
మహాద్వారానికి ఇరుప్రక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తున్నాయి. కదా ! వీరే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు.
ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత, రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి! ఈయన పేరు ‘శంఖనిధి’ ఇలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉన్నాయి.
ఈయన పేరు ‘పద్మనిధి’. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణంగల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండటం గమనించండి.
ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలిది. బహుశా అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చు.
ఆగమశాస్త్రం ప్రకారం సాదారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచెయ్యడం సంప్రదాయం.
దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం. రెండవది విమాన ప్రదక్షిణం.
మూడవది సంపంగి ప్రదక్షిణం. మహద్వార దేవతలైన శ్రీ శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరిద్దాం.
జయ విజయులు
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని తిరమమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంఖుచక్ర గధాధారులై ద్వారపాలకులగు జయవిజయులు నిలచి ఉండి స్వామివారిని సదా సేవిస్తుంటారు. The Divine History of Sri Venkateswara – 73
సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ద్భాక్తులతో వ్యవహరించండని సూచిస్తున్నట్లుగా జయుడు కుడిచేతి చూపుడువేలును విజయుడు ఎడమచేతి చూపుడువేలును చూపిస్తూ ఉంటాడు.
రెప్పపాటు కాలం ఏమరుపాటు చెందకుండా స్వామి భక్తిపరాయణులగు జయవిజయులు స్వామివారి సన్నిధికి వేయికళ్ల కావలికాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తూ శ్రీ మహావైకుంఠాన్ని తలపించేరీతిలో వీరు బంగారువాకిట కావలి కాస్తారు.

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర – 74
– చివరి భాగం –
తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి
భక్తులారా ! భాగవతోత్తములారా! శక్తి సామర్ద్యములు గల స్త్రీ పురుషులు ఆబాలగోపాలము గోవింద నామోచ్చారణం చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళండి అవసరమైతే తిరిగివచ్చేటప్పుడు బస్లో రావచ్చును.
స్నానంచేసి భారతీయ సంప్రదాయంప్రకారం శుచి శుభ్రములైన వస్త్రములను దరించి వారి వారి సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకొని (శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున ఊర్థ్వ పుండ్రమును ధరించుట (నామము) సంప్రదాయము)
శ్రద్ధా భక్తులతో సేవించండి.
స్వామివారిని సేవింపనిదే భుజింపకండి. ఆలస్యమగు పక్షమున శక్తిలేనిచో పండ్లు పాలు వంటివి తగుమాత్రం తీసికొనండి.
ద్వజస్తంభం వద్ద నమస్కరించి మనస్సులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవింద నామం జపిస్తూ లోనికి వెళ్ళండి.
ప్రధాన ద్వారం దగ్గరకురాగానే గరుడాళ్వార్లకు నమస్కరించండి.
ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతిని తీసికొని ఎదురుగాసేవ సాయించుచుండు స్వామివారి దివ్యమంగళ విగ్రహమును కండ్లు చెమర్చగా, శరీరం పులకరింపగా; గద్గదమగు కంఠముతో, పారవశ్యంతో దర్శించండి.
ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్యనివాసమైన వక్షస్థలము గలవాడను, అంజనాద్రికి నిధి వంటివాడును; అఖిలహేయ ప్రత్యనీకుడును; పరమపురుషుడునగు శ్రీనివాసుని కనులార సేవించండి
శ్రీవారి పాదారవిందములు; పీతాంబరం, శ్రీహస్తములు;వక్షస్థలమునగల శ్రీభూదేవులను శంఖచక్రములను, ముఖారవిందమును;రత్నఖచిత కిరీటమును దర్శించి తిరిగి పాదారవింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి ఈక్రింది శ్లోకాలను, పాశురాలను పఠించండి.
పార్దాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌదర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్య మిహతౌ కరర్శితౌతే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే
వినావేంకటేశం ననాథో ననాథ:
సదావేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ.
ఈ శ్లోకాలను అనుసంథానం చేయండి.
దివ్యప్రబన్దం వచ్చినవారు
“అగలిగిల్లేన్ ఇఱైయుమెన్ఱు” “తాయేతన్దై యెన్ఱుమ్”
అనే పాశురాలను అనుసంధానం చేయండి.
దర్శనం చేసికొని
తిరిగివచ్చునప్పుడు స్వామికి వెన్నుచూపరాదు. The Divine History of Sri Venkateswara – 73
ఈ నియమాలను పాటించి ఈ చెప్పిన విధంగా స్వామిని దర్శిస్తే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున ప్రతియొక్కరు తిరుమల యాత్ర చేయండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి.
స్వామివారి దర్శనము చేసుకొని, ప్రసాదాలు తీసుకొని, భక్తులు దిగువ తిరుపతికి వస్తే, అక్కడ దర్శించవలసిన వాటిలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయము ముఖ్యమైనది.
ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ, శ్రీ ఆళ్వార్, శ్రీదేశికర్, శ్రీమణవాళమువి, శ్రీరామానుజ దేవాలయాలున్నాయి. శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి సంవత్సరము వైశాఖమాసములో బ్రహ్మోత్సవాలు జరుపబడుతాయి.
ఊరిమధ్య శ్రీకోదండరామస్వామి కోవెల వున్నది. ఇంకా నమ్మాళ్వార్, పెరియాళ్వార్, కపిలేశ్వర దేవాలయాలున్నాయి. తిరుపతికి మూడుమైళ్ళ దూరములో గల తిరుచానూరులో శ్రీవేంకటేశ్వరస్వామి పద్మావతి దేవుల ఆలయము, పద్మసరోవరము వున్నాయి.
పద్మావతి దేవినే అలివేలు మంగతాయారు అని కూడా అంటారు. ఆ ఆలయానికి వెళ్ళి దర్శనము, పూజలు చేసుకొని భక్తులు తమ యాత్రను సంపూర్తి చేసుకొంటారు.
పుణ్యభూమియైన భారతదేశములో యిది పరమపావనమైన పుణ్యక్షేత్రముఅయినందువల్లను, ఆపద మ్రొక్కులవాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడడములో అపార కరుణామూర్తి అయినందువల్లను,
ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను, నిత్యమూ వేలాది భక్తులు యీ కొండకు వస్తూ పోతూ వుంటారు. ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు. మ్రొక్కుబడులు చెల్లించుకొంటారు.
వీరందరితో యీ క్షేత్రము నిత్య సత్య వైకుంఠములా దేదీప్యమానముగా వుంటుంది. ఈ విధముగా వచ్చే పోయే భక్తుల వల్ల దేవాలయానికి లక్షలాది ఆదాయం వస్తున్నదిl.
ఆ ఆదాయంతో దేవాలయాధికారులు కేవలం యాత్రికుల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహిత కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు.
భక్తులకు కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీవేంకటేశ్వరుడు. తిరుపతి యాత్ర చేసినవారికి నూతన ప్రాంతములు చూచిన వేడుక. భగవంతుని దర్శించుకొన్న ముక్తీ లభిస్తాయి.
శుభం భూయాత్.
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !
శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర అన్ని భాగాలు సమాప్తమైనవి…
కానీ గోవిందుని లీలలకు అంతం ఏమున్నది….
చదివినకొలదీ విన్నకొలదీ. …
తెలుసుకోవలసినది ఇంకా ఉంటూనే ఉంటుంది.
వినావేంకటేశం ననాధో ననాధః
సదావేంకటేశం స్మరామి స్మరామి