Home Bhakthi Vaalmiki Ramayanam – 67

Vaalmiki Ramayanam – 67

0
Vaalmiki Ramayanam – 67
Vaalmiki Ramayanam - 67
Vaalmiki Ramayanam – 67 – రామాయణం – 67 – యుద్ధం ప్రారంభమయ్యింది వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు.
కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారములను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.
వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు ” యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు. వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు.
ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపములో ఉండి యుద్ధం చేస్తాము.
విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు, నేను, లక్ష్మణుడు నర రూపములో ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి ” అని చెప్పాడు.
ఆరోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలములు, ముద్గరములు, శూలాలు, త్రిశూలములు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు.
ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి.
ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశములోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి.
ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుఱ్ఱముల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి. Vaalmiki Ramayanam – 67
అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహము వచ్చింది.
అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పడేసాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది.
ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితములో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.
రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహము వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానము అయ్యి తన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకున్నది.
తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశములో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు.
కద్రువ యొక్క కుమారులైన సర్పములను ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి. సర్పములుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి.
ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనముగా చుట్టేసింది. రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము.
ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు ” అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. Vaalmiki Ramayanam – 67
ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ‘ ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశము పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకాపట్టణమునకు వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపశమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ‘ అని అనుకున్నాడు.
Vaalmiki Ramayanam - 67
Vaalmiki Ramayanam – 67
లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండము చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగముల నుండి శరీరము అంతా అంగుళము చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి ” మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు.
ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకాపట్టణము పీడింపబడినదో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను ” అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.
రాముడు బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు. లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు.
ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్శిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణములతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు.
ఆ సమయములో వానరములు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.
రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి ” నాయనా సుగ్రీవా ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదము వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మోహాన్ని పొందకూడదు.
ఈ సమయములో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వస్తే మనం రక్షింపబడినట్టే.
వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరము నాశనము అయినట్టే. రామలక్ష్మణుల శరీరములలో కాంతి తగ్గలేదు.
అంగుళము మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి ” అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.
కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతముల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. రక్తం వెళ్ళిపోతుండడము వలన వాళ్ళ శరీరములు నీరసపడిపోతున్నాయి.
అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి ” నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను.
కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు? మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు. నాకు లోకములో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని ” అని బాధపడ్డాడు.
విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడము మొదలుపెట్టింది. అంగదుడు అక్కడికి వచ్చి ” ఇంత అసహ్యముగా, ఇంత సిగ్గులేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతుంది ” అని అడిగాడు.
” మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు. ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము ” అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం. దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.
ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో ” తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను.
నేను నిర్మించిన నాగాస్త్ర బంధనము చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతున్నది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ” అన్నాడు.
ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషము పొంది అక్కడున్న భటులని పిలిచి ” యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారని లంకలో చాటింపు వేయించండి.
లంకంతా తోరణాలు కట్టండి. భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవము చెయ్యండి ” అని ఆజ్ఞాపించాడు.
అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి ” మీరు ఒకసారి అశోకవనములో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి.
ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని చూస్తుంది. ‘ ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా ! ఇంక రాముడి మీద ఎందుకు ఆశ? ‘ అని లంకకి వచ్చి అలంకారము చేసుకుంటుంది. మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషిత అయి నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి ” అన్నాడు.
యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహముతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందముగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనముగా నిలుచుని ఉన్నారు.
ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానములో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది.
సీతమ్మ ” నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి ‘ అమ్మా ! నీ పాదములలో పద్మరేఖలు ఉన్నాయి.
ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనము మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకము చేసుకుంటుంది ‘ అన్నారు. వారు చెప్పిన మాటలన్నీ అసత్యములు అయ్యాయి. Vaalmiki Ramayanam – 67
చిన్నతనములో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు.
వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి ‘ తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక అయిదోతనాన్ని పూర్ణముగా పొందుతుంది.
మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది ‘ అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి. అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.
రామా ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యము అంతా వెతికావు. హనుమని పంపించావు. నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు.
చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు. ఎంత ఆశ్చర్యం! నీకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం తెలుసు. ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలము మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరము వదిలేశావు.
నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బ్రతుకుతారా ! అయోధ్య అయోధ్యలా ఉంటుందా! నువ్వు ఇన్ని కష్టములు పడడానికి అర్ధాంతరముగా శరీరము విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావా!నువ్వు నన్ను చేసుకోకపోతే బాగుండేదేమో ” అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకములో ఉన్న త్రిజట చూడలేకపోయింది.
” ఏడవకు సీతమ్మా ! రామలక్ష్మణులు మరణించలేదు. వాళ్ళిద్దరూ సజీవముగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకోవద్దు. Vaalmiki Ramayanam – 67
నేను నీకు రామలక్ష్మణులు బ్రతికి ఉన్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు. నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశములో నిలబడి ఉన్నదంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు.
ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు.
ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది.
అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మా ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు. ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను.
రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం. నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ ” అని చెప్పింది. ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.
రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి ” ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే నేనొక్కడినే బ్రతికితే సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు? ఏ లోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు.
లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. వెయ్యి చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడు ఒకసారి రావణుని ఓడించి చెరసాలలో బంధించాడు.
ఒకేసారి ఐదువందల బాణములను ప్రయోగము చేసేవాడు. అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉన్నది.
నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు? నాకు ఈ జీవితము అక్కరలేదు ” అని రాముడు బాధపడ్డాడు.
సుగ్రీవుడిని పిలిచి ” సుగ్రీవా ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారము చాలు. లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను.
ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారము చేసారు.
మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటినుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను ” అన్నాడు.
సుగ్రీవుడు ” విభీషణా ! నువ్వు వానరములను తీసుకొని కిష్కిందకి వెళ్ళు. నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణా ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు. ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు. తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో ” అన్నాడు. Vaalmiki Ramayanam – 67

Leave a Reply

%d bloggers like this: