Home Bhakthi Vaalmiki Ramayanam – 65

Vaalmiki Ramayanam – 65

0
Vaalmiki Ramayanam – 65
Vaalmiki Ramayanam -76
Vaalmiki Ramayanam – 65 – రామాయణం – 65 – అప్పుడు విభీషణుడు ” నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి. పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నము చేశాను.
నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు.
యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడము వల్ల నీకు భయం ఏర్పడుతున్నదని, నీకు ప్రమాదకరముగా ఉన్నానని, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు. నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు. Vaalmiki Ramayanam – 65
నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, బంధువులు, అందరూ సుఖంగా ఉండండి ” అని చెప్పి రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులుకూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.
విభీషణుడు మిగతా నలుగురు రాక్షసులు ఉత్తరదిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశములో నిలబడ్డారు. ఆకాశములో విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరమలు ” రాక్షసుడు వచ్చాడు కొట్టెయ్యండి ” అని అక్కడున్న చెట్లని, పర్వతములను పెకలించేశారు.
విభీషణుడు బెదరకుండా ” నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని. నన్ను విభీషణుడని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు.
దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉన్నది కనుక నేను ఆయనని విడిచిపెట్టి ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగిన రాముని శరణు కోరి వచ్చాను. నేను మీకు శత్రువుని కాదు ” అన్నాడు.
సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి ” వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశములో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపితే మన సైన్యంలో ఎటువంటి లోపములున్నాయో కనిపెడతాడు. Vaalmiki Ramayanam – 65
ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కల్పిస్తాడు. నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వవద్దు. మాకు అనుమతి ఇవ్వు వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే కాకి పిల్లలని గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. ” అన్నాడు.
రాముడు ‘’ సుగ్రీవా !నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్దాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా ” అని అడిగాడు.
అంగదుడు లేచి ” మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము ” అన్నాడు.
శరభుడు” మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయము ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము ” అన్నాడు.
జాంబవంతుడు అన్నాడు ” ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు పరుల ప్రదేశములో మనం ఉన్నాము. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. ఈయనని తీసుకోకపోవడమే మంచిది ” అన్నాడు.
Vaalmiki Ramayanam - 65
Vaalmiki Ramayanam – 65
మైందుడు ” మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము. చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనని స్వీకరిద్దాము. లేకపోతే ఆయనని స్వీకరించవద్దు ” అన్నాడు.
రాముడు హనుమ వంక ‘ నువ్వేమి చెప్పవా!’ అన్నట్టు చూశాడు. హనుమంతుడు లేచి ” మహానుభావా ! నువ్వు మూడు లోకములలో జరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నీకు వేరొకరు చెప్పవలసిన అవసరము లేదు.
నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు.
మీరు నాయందు గౌరవముంచి అడిగారు. నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి. Vaalmiki Ramayanam – 65
కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు. విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే తన స్వరూపంతో వచ్చి ఆకాశములో నిలబడి ‘ నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను ‘ అని అతను చెప్పవలసిన అవసరము లేదు.
కొంతమంది గూఢచారులని పంపమన్నారు. మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానము ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు? కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు.
మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసినవాడు అమిత్రత్వముతో అక్కడినుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం నష్టపోతాము. అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడము సాధ్యం కాదు.
కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దాము అన్నారు. వేరొకరియందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మనయందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము, కాలము యందు దోషముందని చెప్పారు. దేశము చేత, కాలము చేత ఇప్పుడే యదార్ధమైన స్థితి ఉన్నది.
ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశములో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతముగా, నిర్మలముగా, ప్రశాంతముగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడలేదు.
మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడము లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను.
విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు. ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు. మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకము చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు.
అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకము చేస్తారని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చని నేను అనుకుంటున్నాను ” అన్నాడు.
రాముడు ” ఇప్పటిదాకా మీరందరూ దోషములు ఉన్నాయా? దోషములు లేవా? తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమిమీద పడి ‘ రామా ! నేను నీవాడను, నువ్వు నన్ను రక్షించు ‘ అన్నవారి యందు నేను గుణదోష విచారణ చెయ్యను.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే|
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ||
వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరే రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది. అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది.
అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము. కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.
సుగ్రీవా ! ప్రపంచములో భరతుడులాంటి సోదరుడు ఉండడు (కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక) నాలాంటి కొడుకు ఉండడు (తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. Vaalmiki Ramayanam – 65
అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడవద్దు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.
పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు.
ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యములో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తాను ఏ ఆడపావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు.
ఆ మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. ఆ వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్థతని పొందాడు.
ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడము కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే, ఒక మగ పావురం ఆతిథ్యం ఇచ్చి తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది.
నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజుని అవుతానా ? క్షత్రియుడని అవుతానా? ఈ భూలోకంలో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను.
శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను ఆయనని తీసుకురండి ” అన్నాడు.
సుగ్రీవుడు ” రామా ! నీకు తప్ప ఇలా మాట్లాడడము ఎవరికి చేతనవుతుంది? నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ” అన్నాడు.
రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ‘ ఇది రాముడు నిలబడిన భూమి ‘ అని ఆ భూమికి నమస్కరించి ” రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు.
నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగిలించి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి ” అన్నాడు.
రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. రాముడు” విభీషణ బెంగపెట్టుకోవద్దు. Vaalmiki Ramayanam – 65
రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకము చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేస్తాను ” అన్నాడు.
విభీషణుడు ” మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను ” అన్నాడు.
రాముడు ” లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలములని తీసుకురా. ఈయనకి అభిషేకము చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను ” అని విభీషణుడికి పట్టాభిషేకము చేశాడు.
రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలము అంతటినీ చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి ” అది వానర సైన్యమా? సముద్రము పక్కన నిలబడ్డ మరో సముద్రములా ఉన్నది.
నువ్వు ఆ వానరబలమును గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు ” అన్నాడు.
” నేను మాత్రం సీతని ఇవ్వను ” అని శుకుడు అనేవాడిని పిలిచి ” నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ‘ నువ్వు వానరుడివి.
నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని. మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు.
ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడము? నా మాట విని మీరు వెళ్ళిపొండి ‘ అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి నేను ఆయన కుశలమడిగానని చెప్పు ” అని శుకుడిని పంపించాడు.
శుకుడు పక్షి వేషములో వచ్చి ఆకాశములో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు “
దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు? రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు ” అన్నాడు.
ఈలోగా అక్కడున్న వానరములు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. శుకుడు ‘ రామ రామ ‘ అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరములను శాంతింప చేసి శుకుడిని విడిపించాడు. వానరములు శుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.
ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది? అని విభీషణుడిని అడుగగా ఆయన ” రాముడు శరణాగతి చేస్తే సముద్రము దారి ఇస్తుంది ” అన్నాడుVaalmiki Ramayanam – 65
చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో అలంకరింపబడ్డ బాహువు, ఆయన యందు ప్రీతి ఉన్న కౌసల్యాది తల్లులవంటి అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు.
మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాలేదు. రాముడికి ఆగ్రహము వచ్చి లక్ష్మణుడితో అన్నాడు ” ఈ ప్రపంచం పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండిపోయేట్లు చేస్తాను.
ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది.
అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు ” అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానము చేశాడు.
అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి. రెండు యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.
సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభమునకు తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు.
గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి ” భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావము ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు.
సముద్రం అంటే అగాధముగా ఉండాలి. లోతుగా ఉండాలి. అందులోకి దిగినవాడికి ఆధారము చిక్కకూడదు. సముద్రములో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైన తరంగములతో ఒడ్డుని కొడుతూ ఉండాలి.
ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడము, సముద్రంలో నుంచి దారి ఇవ్వడము నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు.
నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు. అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణము తెలుసు.
మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను.
నాలో ఉన్న ఏ కౄర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉన్నది.
అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులనే వారు త్రాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని అక్కడికి ప్రయోగించు ” అన్నాడు.
రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తరదిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది.
” అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి. అక్కడ గోసంపద పెరుగుతుంది. రోగాలు ఉండవు. మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు. Vaalmiki Ramayanam – 65
అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది ” అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.

Leave a Reply

%d bloggers like this: