Kumara Shatakam – కుమార శతకం
సరివారిలోన నేర్పున
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో
నరయుచు మెలగెడి వారికి
బరువేటికి గీడె యనుభవంబు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.

తనుజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యుబ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బతికి యున్ననూ చచ్చినవాడితో సమానం అగును.