పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ
వెన్నుకొని తిరుగుచుండిన
నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.

పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్,
హద్దెఱిఁగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలు నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనము చేతగానీ, దుర్మార్గవృత్తితో గానీ, మర్యాదతో లెవకున్న యెడల నిన్ను వారు మొద్దురీతిగా జూతురే గాని నీవొక ప్రాణము గల మనిషివని తలంపరు.