Sumati sathakam – సుమతీ శతకం
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నకఁజేయువాడె నేర్పరి సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! మనకు ఉపకారము చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట మంచి లక్షణము. అంతేగాని అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారము చేసిన వారిపై నెపములెన్నక తిరిగి వారికే ఉపకారము చేయగలిగినవాడే “నేర్పరి” అనిపించుకొనును.

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! ఎవరికైనా తన కోపమే తన శత్రువగును. తన శాంతమే తనకు రక్షగా నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును. తాను సంతోషముగా ఉండగలిగినచో అది స్వర్గంతో సమానం. తాను దుఃఖమును చేతులారా తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యం అని భావం.