
జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: శివుడికి, జీవుడికి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు.

ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము. Vemana sathakam