Vemana sathakam
పూర్వజన్మమందు పుణ్యంబు చేయని
పాపి తా ధనంబు బడయలేడు
విత్తమరచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.

గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
బండ్ల నూడ దన్ను పాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గొడ్డుటావు దగ్గరకి కుండని తీసుకునిపోయి ప్రయత్నిస్తే పళ్ళు రాలేలా తంతుందే గాని పాలనివ్వదు. అదే విధంగా పిసినిగొట్టు వానిని ఎంత ప్రాధేయపడినా నోరు నొప్పి పుడుతుందే కాని పైసా కూడా వాని నుంచి పొందలేము అని అర్థం.