
Kumara Shatakam
వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు.

ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకుమయ్య కుమారా!
తాత్పర్యం: ఓ కుమారా! ఉపాధ్యాయుని ఎదురింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. మంచి నడవడిని వదిలి పెట్టవద్దు.