Vemana sathakam – వేమన శతకం
కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం. Vemana sathakam

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: శివుడికి, జీవుడికి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు. Vemana sathakam