Home Bhakthi Magha Purana – Chapter 23

Magha Purana – Chapter 23

0

నారదుని దౌత్యము – దేవతల దైన్యము

Magha Purana – Chapter 23

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పముపై నున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి , ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాతవృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా ! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా ? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకాశపడి భూమిపై వ్రానియవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను.

ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము , చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధాపూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదనొకండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక , శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున దిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.

నారదకృత విష్ణుస్తుతి

ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే

గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||

మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే

శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||

అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ

సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||

నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే

భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||

నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన

సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||

సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి

పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||

పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః

సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||

త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః

ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||

త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే

జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||

త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో

గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||

ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం

ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||

నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె *’నారదా ! స్వాగతము ఇప్పుడెందులకీ స్తుతి ? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించు చుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలె దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.

నారదుని మాటలను విని శ్రీహరి ‘నారదా ! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను , తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు , సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను , తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను , ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికాని , తెలియకకాని దాటిన , తొక్కిన యెంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదనొకందు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించు చూనే ఉన్నాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఏవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము ‘ నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక తన దారిన బోయెను అని గృత్నృమదమహాముని జహ్నువునకు చెప్పెను.

Leave a Reply

%d bloggers like this: