Home Bhakthi Maghapuranam-22th chapter

Maghapuranam-22th chapter

0

క్షీరసాగర మధనము

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు, అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.

దేవదానవులు చేసిన శివస్తుతి

నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే

నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||

నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ

నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||

త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక

త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||

త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే

అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||

హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే

మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||

పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్

అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.

ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.

రాహుకేతువుల వివరణ

రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.

చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.

ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.

పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును ‘నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని ‘ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును ‘నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి యింద్రునకు ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.

Leave a Reply

%d bloggers like this: