Home Poetry TODAYS TELUGU POEM

TODAYS TELUGU POEM

0

వేమన పద్యం .

కుక్క గోవు గాదు కుందేలు పులిగాదు!

దోమ గజము కాదు దొడ్డదైన!

లోభి దాతగాడు లోకంబు లోపల!

విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం :

ఊరంతా కలియదిరిగే కుక్కను పాలిచ్చే ఆవుతో పోల్చడం కుదరదు. ఆకు కదిలితేనే పారిపోయే పిరికిదైన కుందేలుకు అల్ప ప్రాణులను వేటాడే పులితోనూ పోల్చలేము.

పెద్ద దోమ అయినా, భారీ ఆకారమైన ఏనుగు ముందు అదెంత..? అలాగే పరోపకారి అయిన దానగుణ శీలికి దక్కే గౌరవం.. పిసినారికి దక్కుతుందా…? మంచి ప్రవర్తన వల్లనే లోకంలో ప్రసిద్ధి కలుగుతుందని ఈ పద్యం యొక్క భావం.

వ్యాఖ్య.

ఈ పద్యంలో మూగజీవాల్ని ఆసరాగా చేసుకుని నీతిని బోధించాడు వేమన. జవం, జీవం ఉన్న భాషగా తెలుగు రాటుతేలడానికి మూగజీవాలను అడ్డంపెట్టుకుని మాట్లాడటమే ప్రధాన కారణమని అంటారు. జంతుతంత్రానికి పెద్దపీట వేసిన పరవస్తు చిన్నయసూరి పంచతంత్రం ఎవరికి తెలియదు.

తెలుగుసామెతలు నెమరు వేసుకున్నా ఇదే వరస! (నెమరు వేసుకోవడాన్ని పశువులు కదా చేసేది మనుషులు కాదు కదా అన్నా తెలుగుదొర వినడు! నా’మాట’ తీరు అంతేనంటాడు.)

తెలుగువాడికి కోపమొస్తే ఎదుటివాణ్ని ‘అడ్డమైనవాడు’ అంటాడు. అడ్డమైనవాడు అంటే పశువు అని తిట్టినట్టు. ఎందుకంటే మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. ఇదీ సృష్టి రహస్యం.

తెలుగువాడు తిట్టినా పొగిడినా మూగజీవాల ప్రస్తావన లేనిదే గడవదు. గాడిద చాకిరి చేస్తున్నానని తన మీద తాను సానుభూతిని ఒలకబోసుకునే తెలుగువాడు ఎదుటివాడి మీద చిందులు వేసేటప్పుడు ‘గాడిద కొడకా’ అని తిట్టడానికి వెనకాడడు.

అంతేకాదు, ‘వీడా! నా కొడుకంచు గాడిద ఏడ్చింది’అన్న మాటనూ తన నోటనే పలికిస్తాడు. ‘అడ్డగాడిద’ అనే తెలుగువాడి తిట్టు ఇంకో భాషలో కనబడదు.

తెలుగువాడు కుక్క విశ్వాస వంతమైన జంతువు అని ఒకపక్క పొగుడుతూ, ఇంకోపక్క ‘కనకపు సింహాసమున శునకము కూర్చుండబెట్టి’ అంటూ రాగాలాపన చేస్తుంటాడు.

కుక్కను తంతే డబ్బులు రాలతాయని తెలిసినా సదరు అమాయక జీవిని ఏడిపిస్తుంటాడు. ‘కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదగలవా?’ అని సవాలు విసురుతాడు. వ్యవహారం చెడిపోతే ‘కుక్కలు చింపిన విస్తరి’ అయిందంటాడు.

‘కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు’ అని పై పద్యంలోలా ఈసడిస్తాడు.

‘కుక్క తోక వంకరలే’ అని ఒక్క ముక్కలో ముక్క చీవాట్లు పెట్టినంత ఘోరంగా ముఖం పెడతాడు. కుక్కను వదలకుండా ‘వరస’పెట్టి తిడతాడు. ‘ఒసేయ్‌ కుక్కా అంటే ఏమిటే అక్కా’ అన్నట్టు ఉందంటాడు తెలుగువాడు. ‘చూస్తే చుక్క లేస్తే కుక్క’ అని నఖశిఖ పర్యంతం పరిశీలించి చెబుతాడు.

‘అవసరం తీరితే అక్క మొగుడు కుక్క’ అంటాడు. కుక్కల్నీ విభజించి పాలిస్తాడు. ‘మొరిగే కుక్క కరవదు’ అంటాడు.

చివరకు కుక్కల తిండినీ ‘లెక్క’ పెడతాడు. కూరలేని తిండి కుక్క తిండి అంటాడు. తెలుగువాడి గొడవ ఒకటి కాదు. ‘నక్క జిత్తులు’ అంటాడు- ‘పాము పగ’ అంటాడు. ‘నత్త నడక’ అంటాడు. ‘కోతి చేష్టలు’ అంటాడు. భాషతో ‘కోతి కొమ్మచ్చి’ ఆడతాడు. గిట్టని వాడిది ‘కోతి మొహం’ అంటాడు. ‘అసలే కోతి… కల్లు తాగింది’ అని తెలుగువాడు అన్నా, వాడి మీద అభిమానంతో కోతి పరువునష్టం దావా వేయడంలేదు.

ఒక్కోసారి కోతిలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయిందని బాధపడతాడు. నక్క బావకు ఎన్ని జిత్తులున్నా తెలుగువాడి ఎత్తుల ముందు అది చిత్తు కావలసిందే. ‘నక్క ఎక్కడ నాగలోకమెక్కడ?’ అని తేల్చి పారేస్తాడు.

ఉపసంహారం.

ఈ పద్యంద్వారా లోభత్వం మానమన్నాడు. మరి లోభి అంటే ఎలా ఉంటాడో తెలుసుకుని ఆ లక్షణాలకు దూరంగా ఉందాం.

దొంగ వినయము (కపటంతో తోకూడిన వినయము) నటిస్తూ, మెచ్చుకోలు మాటలు చెప్పి , నేటి పరిభాషలో మస్కాకొట్టి లేదా కాకాపట్టి, నానా గడ్డి కరిచి ధనము, సంపద సంపాదించి కడుపు మాడ్చుకొని (తిండికూడా సరిగా తినక, కనీసం తన అప్తులకు కూడాపెట్టక) పోగేసు కోవడం ఎలాంటిదంటె కుక్కలేదా పందికొక్కులేదా ఎలుక అంతకుముందు తెచ్చుకొన్నవి తినక కక్కుర్తి పడి బోను ముందర చల్లిన మెతుకులకు (ఆహారము/ఎరకు) ఆశపడి బోనులో చిక్కి ముందు సంపాదించుకొన్నదంత పోగొట్టుకునే వాడు. అలా బ్రతకొద్దని హెచ్చరిస్తున్నారు. స్వస్తి.

Leave a Reply

%d bloggers like this: